తల్లిని అడవిలో వదిలేసిన కూతురు
నవ మాసాలు మోసి కని.. పెంచి పెద్ద చేసిన తల్లి. ఇప్పుడు జీవిత చరమాంకంలో ఉంది. ఈ సమయంలో ఆమెకు ఆసరాగా ఉండి సాగాల్సిన కూతురు కర్కశంగా వ్యవహరించింది. ఆమె వద్ద ఉన్న బంగారు అభరణాలు లాక్కుని దట్టమైన అడవిలో వదిలేసింది. ఈ ఘటన తెలంగాణ జగిత్యాల జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా వీధిలో నివసించే వృద్ధురాలు బుధవ్వను కూతురు ఈశ్వరి నగలు, డబ్బులు లాక్కుని గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి అడవిలో వదిలేసింది. రెండు రోజులుగా ఆకలి, దాహంతో అలమటించిన బుధవ్వను శ్రీరాములపల్లి యువకులు రక్షించి, సంక్షేమ అధికారులకు సమాచారం అందించారు. ఆమెను సఖి సెంటర్‌కు తరలించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుధవ్వ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తల్లి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించిన కూతురిపై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.