రూ.300 కోట్లకు ఆశపడి మామను హత్య చేసిన కోడలు
నాగపూర్‌లో దారుణం జరిగింది. తన మామగారి పేరిట ఉన్న రూ.300 కోట్లకు ఆశపడి 82 ఏళ్ల వృద్ధుడైన మామగారినే హత్య చేయించింది ఒక కోడలు. ఈ కేసును 15 రోజుల అనంతరం చేధించారు పోలీసులు. మంగళవారం ఆమెను అరెస్టు చేశారు. అర్చనా పుట్టేవార్ అనే మహిళ రూ.300 కోట్ల ఆస్తి ఉన్న మామగారిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. గత నెల 22న ఒక కారు ఢీకొట్టడంతో 82 ఏళ్ల వృద్ధుడు పురుషోత్తం పుట్టేవార్ అక్కడి కక్కడే మరణించారు. దీనిని యాక్సిడెంట్ కేసుగా భావించిన పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. కానీ తర్వాత జరిగిన లోతైన విచారణలో భాగంగా అతని కోడలే హంతకురాలని తేలింది. అర్ఛన ఈ హత్యకు గాను రూ. 1 కోటితో కిరాయి హంతకులతో బేరం మాట్లాడుకుంది. ప్రమాదంగా చిత్రీకరించేలా పాత కారుని కొనుగోలు చేసి నడిచి వెళుతున్న పురుషోత్తంను ఢీకొట్టారు హంతకులు. ఈ కేసులో నిందితురాలైన అర్చన టౌన్ ప్లానింగ్ డిపార్టమెంట్‌లో అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తోంది. ఆమెపై 40 వరకూ కేసులున్నాయని, అనేక అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చారని పేర్కొన్నారు పోలీసులు.