News

అస్థిర ఆంధ్రను సుస్థిర స్వర్గాంధ్రగా మార్చడమే జనసేన-టీడీపీ ఉమ్మడి లక్ష్యం

ఏపీ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం, వైసీపీ వచ్చాక అన్ని వర్గాలకి సమస్యలే
ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ కేసులుపెడుతున్నారు
చంద్రబాబుని అక్రమ కేసులతో అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేస్తున్నారు
రాష్ట్రానికి పట్టిన తెగులు వైసీపీ, ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల్లో బలంగా వెళ్తాం
సంయుక్తంగా జనసేన-తెలుగుదేశం ప్రచారం-పవన్ వ్యాఖ్యలు
29వ తేదీ మంచి జిల్లా స్థాయిలో ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తల సమావేశాలు
వైసీపీ పాలనలో సాగుతున్నది సామాజిక అన్యాయం: నారా లోకేష్‌

అంధకారంలో నిండి.. అస్థిరతకు గురైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మళ్లీ సుసంపన్నమైన సుస్థిరత కలిగిన ఆంధ్రప్రదేశ్‌ గా తీర్చిదిద్దడమే జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి లక్ష్యం. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితిని గమనించే 2022లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సాక్షిగా వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా బలమైన కొత్త ప్రభుత్వం రావాలని ఆకాంక్షించాను. ఆ మాటకు కట్టుబడే అక్రమ కేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శకు వచ్చిన సందర్భంగా వచ్చే ఎన్నికల్లో జనసేన- టీడీపీ సంయుక్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తాయని పొత్తు నిర్ణయం చెప్పాను. వైసీపీ పాలనలో సీపీఐ, సీపీఎం, బీజీపీ పార్టీలతో సహా రాష్ట్రంలోని అన్నీ పార్టీల నాయకులు వైసీపీ బాధితులే. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలన అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్‌ పునరుజ్జీవం కోసం వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కలిసి ముందుకు వెళ్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో జనసేన – తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. సుమారు 3 గంటలకు పైగా సుదీర్జంగా సాగిన సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సమస్యలు, జనసేన – తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాచరణ, కార్యకర్తలు, నాయకుల సమన్వయం తదితర కీలక అంశాలపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం పవన్‌ కళ్యాణ్‌ , తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ… “వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను రకరకాలుగా హింసిస్తూ, బెదిరిస్తూ, భయపెడుతూనే పాలన సాగిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులపైనా అక్రమ కేసులను బనాయించారు. విపక్ష పార్టీల నాయకులు, కార్యర్తలపై వైసీపీ నాయకులు భౌతిక దాడులకు తెగబడ్డారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు వరకు అందరిపై అక్రమ కేసులు బనాయించి, జైళ్లలో పెట్టి వైసీపీ నాయకులు వికృతానందం పొందారు. దేశ సమగ్రతతోపాటు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం మాకు ముఖ్యం. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌ కు అనుభవం ఉన్న నాయకత్వం అవసరం అనే భావనతో అప్పట్లో టీడీపీ, బీజేపీల ప్రభుత్వానికి జనసేన మద్దతు పలికింది. కచ్చితంగా అది రాష్ట్రానికి మంచి చేస్తుందని బలంగా భావించాం. ఇప్పుడు కూడా వైసీపీ నాలుగున్నర ఏళ్ల పాలనలో తిరోగమనంలో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి పురోగమించేలా చేసే బాధ్యతను జనసేన-తెలుగుదేశం తీసుకుంటుంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బలంగా పోరాడి, వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ నాకు వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదు, కేవలం వైసీపీ ప్రభుత్వం విధానాలు, అరాచకాలు, ఆకృత్యాలు, దాడులు, అక్రమ కేసులు వంటి వాటికి మాత్రమే నేను వ్యతిరేకం. ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి, బెదిరించి పరిపాలన సాగించాలని వైసీపీ భావిస్తోంది. అధికారం కోసం నానా రకాల హామీలు ఇచ్చి… అధికారం అందిన తరువాత మాట మార్చిన విధానానికి మేము పూర్తిగా విరుద్దం. మద్య నిషేధం పేరు చెప్పే అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగంగా కల్తీ మద్యం అమ్ముతూ లక్షలాది మంది ఆరోగ్యాలను కబళిస్తోన్న వైసీపీ ప్రభుత్వ అసమర్ధతకు మేం వ్యతిరేకం.

జనసేన – టీడీపీ కలయికే సరైన వ్యాక్సిన్‌
రూ.30 వేల కోట్ల మద్యం దోపిడీ, వేలాది కోట్ల ఇసుక, ఖనిజాల దోపిడీ చేస్తున్న వైసీపీ రాష్ట్రాన్ని మింగేయాలని చూస్తోంది. అడిగిన వారిపై కేసులు పెడుతూ భయపెడుతోంది. అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌ ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే వైసీపీ ప్రభుత్వ తప్పులు కోకొల్లలు. రాష్ట్రానికి పట్టిన వైసీపీ తెగులుకు జనసేన-టీడీపీ వ్యాక్సిన్‌ గా పని చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, భద్రత కోసం రెండు పార్టీల కలయక పని చేస్తుంది.
రాజమహేంద్రవరం వంటి చారిత్రాత్మక ప్రదేశంలో, వీరేశలింగం పంతులు సామాజిక మార్పు కోసం మొదటి అడుగు వేసిన నగరంలో, ఆదికవి శ్రీ నన్నయ్య జన్మించిన గొప్ప ప్రాంతంలో ఈ భేటీ జరగడం ఆనందించదగ్గ విషయం.

చంద్రబాబుని కావాలనే వైసీపీ వేధిస్తోంది
అక్రమంగా చంద్రబాబుని కేసుల్లో ఇరికించి వైసీపీ ప్రభుత్వం కావాలనే వేధిస్తోంది. చిత్ర హింసలకు గురి చేస్తోంది. ఆయనకు బెయిల్‌ కూడా రానివ్వకుండా సాంకేతిక కారణాలు చూపి అడ్డుకుంటోంది. 14 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతంగా పెట్రోల్‌ పోసి తగలబెట్టి హత్య చేసిన వ్యక్తికి సమయానికి బెయిల్‌ వస్తే … అకారణంగా జైల్లో పెట్టిన చంద్రబాబు విషయంలో మాత్రం రకరకాల కారణాలు చూపుతున్నారు. రాజమండ్రిలో ఈ భేటీ ఉద్దేశం కూడా అన్యాయంగా జైల్లో ఉన్న చంద్రబాబుకి నైతిక మద్దతుగా, ఆయనకు మనో ధైర్యం ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం. ఈ భేటీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతుంది. వైసీపీ దాష్టీకాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడేందుకు ఉమ్మడి కార్యాచరణ అమలు చేస్తాం. భేటీలో పలు కీలక అంశాలపై ప్రస్తావన వచ్చింది. దానిపైన పూర్తిస్థాయి చర్చ జరిగింది. ఎన్నికలు 150 రోజులు కూడా లేని తరుణంలో ఉమ్మడి ప్రణాళికతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? వైసీపీ దాష్టీకాలను ఉమ్మడిగా ఎలా ఎదుర్కొవాలి? కార్యకర్తలు, నాయకులను ఎన్నికలకు ఎలా సమాయత్తం చేయాలనే దానిపై చర్చించాం. ఉమ్మడి మేనిఫెస్టో గురించి భేటీలో చర్చించాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో ప్రకటించిన తరుణంలో జనసేన ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా చేర్చి ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే సంపూర్ణంగా ప్రజల ముందు పెడతాం. భేటీలో సీనియర్లు అయిన నాదెండ్ల మనోహర్‌ యనమల రామకృష్ణుడు వంటి పెద్దల సూచనలు, సలహాలు తీసుకున్నాం.

ప్రజలకి భరోసా కలిగిస్తాం
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో భరోసా నింపేలా భేటీలో చర్చ సాగింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి పథకాలు ఇవ్వాలి, వివిధ వర్గాలను ఎలా ఆదుకోవాలి..? రాష్ట్రాన్ని ఎలా సుభిక్షంగా తీర్చిదిద్దాలి అనే అంశాలతో పాటు రాష్ట్ర సమోన్నత అభివృద్ధి ధ్యేయంగా జనసేన- తెలుగుదేశం కచ్చితంగా పనిచేస్తాయి. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇరు పార్టీల ఉమ్మడి హామీలు, ఆలోచనలు కలగలిపి ఉంటాయి. వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజమహేంద్రవరం సాక్షిగా మరో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రం చిత్రమైన పరిస్థితిలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తే జనసేన మొదటి ప్రాధాన్యం బీజేపీ అగ్రనాయకత్వం సైతం మా ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటుంది అని భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, యాత్రలు వారు చేసుకుంటే, జనసేన పార్టీ అనుకున్న కార్యక్రమాలు విడివిడిగా ఉంటాయి. అలాగే ఉమ్మడి కార్యక్రమాలు కూడా కలిసి చేస్తాం.

ఈ నెల 29 నుంచి ఉమ్మడి యాక్షన్‌ ప్లాన్‌ : నారా లోకేష్‌
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మాట్లాడుతూ “విజయదశమి రోజు రాష్ట్రానికి మేలు చేసే కలయిక ఇది. రాష్ట్రానికి మంచి జరగాలనే గొప్ప ఆశయం కలిగిన జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ 2014లోనూ షరతులు లేకుండా అప్పటి తెలుగుదేశం, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. మళ్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం… వైసీపీ చేస్తోన్న అరాచకాలను నిలువరించడం కోసం టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలపై దాడులు, ప్రశ్నిస్తే కేసులు ఎక్కువయ్యాయి. అమర్నాథ్‌! గౌడ్‌ అనే 14 ఏళ్ల బాలుడ్ని కిరాతకంగా చంపి బెయిల్‌ పై బయటకు వచ్చిన వారికి ఊరేగింపులు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు వైసీపీ తొలగించింది. దాదాపు 16 వేల మందికి పైగా బీసీలు రాజ్యాధికారానికి దూరమయ్యారు. ఎస్సీలను వెంటాడి, వేధించి మరి హత్యలు చేస్తున్నారు. డాక్టర్‌ సుధాకర్‌ మరణం నుంచి మొదలు పెడితే ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్‌ డెలివరీ చేసే వరకూ వైసీపీ వాళ్లు వెళ్ళిపోయారు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకోవడం మహాపాపంగా భావిస్తారు. అలాంటిది వైసీపీ దాష్టీకాలకు భయపడి నంద్యాలలో సలామ్‌ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుల చేష్టలకు మిస్ఫా అనే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. లక్షల ఎకరాల్లో పంట నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ చేతకానితనం వల్ల సాగు నీరు సకాలంలో అందడం లేదు. ప్రాజెక్టుల నిర్వహణ గాలికొదిలేశారు. కనీసం కాలువల్లో నాచు కూడా తీసిన పాపాన పోలేదు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంటే, కొలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రకరకాల పన్నులు వేశారు. ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్కరికి కూడా ఉద్యోగం, ఉపాధి చూపలేకపోయారు. రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వలసలు పెరిగిపోయాయి. 44 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌‌ను అక్రమ కేసులను చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. 30 రోజుల్లో ముగిసిపోయే రిమాండ్‌ ను ఎన్నో కారణాలు చూపించి, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు వైసీపీ ప్రభుత్వంపై పోరాడినా వారి గొంతు నొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది.

100 రోజుల ప్రణాళికతో ముందుకు…

తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి 100 రోజుల ప్రణాళిక మీద సమావేశంలో చర్చించాం. దీనిలో భాగంగా మొదటిగా ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తాం. ఆయా జిల్లాల వారీగా ప్రధానమైన అంశాలు, సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై ఈ సమావేశాల్లో ఉమ్మడి కార్యాచరణను నాయకులు ప్రకటిస్తారు. ఉమ్మడి మేనిఫెస్టోను తయారు చేసి నవంబర్‌ 1 తేదీ నుంచి గడప గడపకు ప్రచారం చేసే కార్యక్రమం మొదలుపెడతాం. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న రైతుల దీనస్థితిపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితిపై నివేదికను ఇస్తారు. దాని ఆధారంగా రైతుల పక్షాన ఏ విధంగా పోరాడాలి? వారికి ఎలా అండగా నిలబడాలి అనేది నిర్ణయిస్తాం. సమావేశంలో మూడు తీర్మాలను ఏకగ్రీవంగా ఆమోదించాం. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మొదటి తీర్మానం, వైసీపీ అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ రక్షించడానికి టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న అంశం గురించి రెండో తీర్మానం, ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని వర్గాలకు అభివృద్ది బాటను పరిచే ప్రభుత్వాన్ని తీసుకువస్తామని మూడో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాం. అక్టోబర్‌ 27వ తేదీన ఓటరు లిస్టు బయటకు వస్తుంది. దానిపై ఇంటింటికీ వెళ్లి పూర్తిస్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తలు విచారిస్తారు. లోపాలుంటే ఎన్నికల సంఘానికి తెలియజేస్తాం. అభివృద్ధి, సంక్షేమం అనేది తెలుగుదేశం- జనసేన పార్టీ ప్రభుత్వంలో జోడెద్దుల బండి” అని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నుంచి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, బి. మహేందర్‌ రెడ్డి, కొటికలపూడి గోవింద రావు, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయకర్‌, తెలుగు దేశం నుంచి పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్‌, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.