సీబీఐ విచారణకు దళపతి
చెన్నై: తమిళనాట రాజకీయం మరోసారి ఆసక్తికర మలుపు తీసుకుంది. కరూర్ తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న టీవీకే పార్టీ అధినేత విజయ్ సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ అధికారులు, మూడు రోజుల క్రితమే విజయ్‌కు సమన్లు జారీ చేశారు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన ప్రత్యేక బస్సును సీబీఐ శనివారం సీజ్ చేసింది. సెప్టెంబర్ 27న కరూర్ సభ జరిగిన రోజు ఆ వాహనం ప్రయాణ వివరాలు, దానికి ఉన్న అనుమతులను నిర్ధారించుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి అధికారులు తనిఖీలు చేశారు. బస్సు డ్రైవర్‌ను కూడా సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నించి కీలక సమాచారాన్ని సేకరించింది. విజయ్ విచారణకు హాజరవుతున్న తరుణంలో సోషల్ మీడియాలో ఆయన అరెస్ట్‌పై ఊహాగానాలు జోరందుకున్నాయి.
తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు టీవీకే మొగ్గు చూపుతోందని వార్తలు వస్తున్న తరుణంలో ఈ విచారణ జరగడం చర్చనీయాంశమైంది. అటు బీజేపీ కూడా విజయ్ను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోందని సమాచారం. విజయ్ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకే ఈ విచారణను వేగవంతం చేశారని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, 110 మందికి పైగా గాయపడ్డారు. మొదట రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ, బాధితుల విన్నపం మేరకు సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించింది. రేపు ఢిల్లీలో జరిగే విచారణ తర్వాత సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. విజయ్ అరెస్ట్ అవుతారా? లేక విచారణ తర్వాత వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి. ఇప్పటికే పలువురు టీవీకే ముఖ్య నేతలను ప్రశ్నించిన అధికారులు, విజయ్ ఇచ్చే సమాచారంతో ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

