“చెరువుల నగరం నేడు దుర్గంధమైపోయింది”..ఈటల రాజేందర్
చెరువుల నగరంగా ప్రసిద్ధి పొందిన హైదరాబాదులో నేడు పరిస్థితులు మారిపోయాయి. చెరువులన్నీ మురికి కూపాలుగా తయారయ్యాయి అని విచారం వ్యక్తం చేశారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. కుత్భుల్లాపూర్‌లోని వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈటల. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎంపీ, ఎమ్మెల్యే నిధులేవైనా ప్రజలు కట్టిన పన్నులే. రాష్ట్రప్రభుత్వమైనా, కేంద్రప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. మేం అందరూ ప్రజలు కట్టిన పన్నులకు కాపలాదారులమే. జిల్లా నాయకులు కూడా వాళ్ల స్థాయిలో ప్రజలకు సహాయం చేస్తారు. రాష్ట్రప్రభుత్వం వద్ద డబ్బులేనప్పుడు, మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్రప్రభుత్వమే ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించాలని నేను కేంద్రాన్ని కోరాను.

ఎఫ్‌టీఎల్‌లో ప్రైవేట్ భూములు తక్కువ ధరకు అమ్ముతున్నారు. చెరువులను ఆక్రమించి, స్థలాలుగా మారుస్తున్నారు. ఇలాంటి స్థలాలలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దుర్గంధ పూరితంగా మారిపోయాయి. ఈగలు, దోమలతో ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. నేను రాజకీయనాయకుడినని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ప్రజలకు సేవ చేయడానికి ఎంతో అదృష్టం ఉండాలి. అందరు నాయకులు అవినీతి పరులు కాదు. డబ్బు సంపాదనే ధ్యేయం కాదు. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. కేరళలోని వయనాడ్‌లో, ఉత్తరాఖండ్‌లో ఇవే పరిస్థితులు ఏర్పడ్డాయి. మనం హైదరాబాద్‌లో ఉన్నందుకు చాలా అదృష్టవంతులం. ఇక్కడి ప్రకృతి ఎంతో బాగుంటుంది. వాతావరణం చాలా బాగుంటుందని ఉత్తరాదివారు కూడా అంటారు. దేశంలో జనాభాతో పాటు జాతీయాదాయం కూడా పెరుగుతోంది. మీరు చెప్పిన అంశాలన్నీ కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. నేను ధర్మాన్ని,శ్రమను, ప్రజలను నమ్ముకున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్లు. నాయకుడు ఎంత గొప్పవాడైనా అతడిని ఎన్నుకునే హక్కు ప్రజలకే ఉంటుంది. మొక్కలు మనకు ప్రాణవాయువు అందిస్తాయి. అలాంటి మొక్కలను విరివిగా పెంచుకుందాం. ఇలాంటి వనమహోత్సవాలెన్నో చేసుకుందాం”. అని పేర్కొన్నారు ఈటల.