Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

మారుతున్న మునుగోడు ముఖచిత్రం

మునుగోడు నియోజకవర్గంలో మద్యం మహమ్మారిని నియంత్రించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని పునర్నిర్మించాలన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంకల్పం ఇప్పుడు ఒక మహోద్యమంలా పల్లెపల్లెకూ పాకుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేసే వ్యాపారం సమాజానికి మేలు చేయదనే దృఢ నిశ్చయంతో ఆయన తీసుకుంటున్న చర్యలు నియోజకవర్గ ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. ముఖ్యంగా మద్యం విక్రయ సమయాల్లో మార్పులు చేయాలని కోరడానికి వచ్చిన వ్యాపారులకు, పొద్దంతా మీరు తాగిన తర్వాతే ప్రజలకు తాపించండని , ఆయన ఇచ్చిన నిక్కచ్చి సమాధానం ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైన్ షాపులు తెరవకూడదని, సాయంత్రం ఆరు గంటల తర్వాతే పర్మిట్ రూమ్‌లు నిర్వహించాలని ఆయన విధించిన నిబంధనలు క్షేత్రస్థాయిలో అక్షరాలా అమలువుతున్నాయి. ఇది గమనించిన మహిళలు, మేధావులు రాజగోపాల్ రెడ్డి చిత్తశుద్ధిని వేనోళ్ల కొనియాడుతున్నారు.

ఈ సంకల్పానికి మద్దతుగా ఇప్పుడు పల్లెల్లో యువత, మహిళలు స్వచ్ఛందంగా కదులుతున్నారు. గట్టుప్పల్ మండలం వెల్మకన్నే వంటి గ్రామాల్లో యువత భారీ ర్యాలీలు నిర్వహిస్తూ బెల్ట్ షాపుల నిర్మూలనకు నడుం బిగించారు. ప్రతి కిరాణా షాపు యజమానిని కలిసి, రాజగోపాల్ రెడ్డి ఆశయాలకు విరుద్ధంగా చాటుమాటుగా మద్యం అమ్మకాలు జరిపితే ఊరుకోబోమని హెచ్చరిస్తూ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 2018లోనే బెల్ట్ షాపులను రూపుమాపాలని పిలుపునిచ్చి, ఆ దిశగా అడుగులు వేసిన గ్రామాలకు తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన చరిత్ర ఆయనది. నాటి రాజకీయ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయిలో సాధ్యం కాకపోయినా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ లక్ష్యాన్ని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తున్నారు.

మనిషి జీవన విధానం ప్రకృతికి అనుగుణంగా ఉండాలని, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కష్టపడి పనిచేయాల్సిన సమయాన్ని తాగుడుకు బానిసై వృథా చేయకూడదన్నది రాజగోపాల్ రెడ్డి ప్రధాన ఉద్దేశ్యం. అతిగా మద్యం సేవించడం వల్ల చిన్న వయసులోనే పురుషులు ప్రాణాలు కోల్పోతూ, అనేక కుటుంబాల్లో మహిళలు అకాల వైధవ్యాన్ని అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ఈ మార్పు తన నుండే మొదలవ్వాలని భావించి, తన అనుచరులు మరియు అభిమానులు కూడా పగటిపూట మద్యం సేవించవద్దని ఆయన కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ అనుచరులు కూడా పగటిపూట మద్యానికి దూరంగా ఉండటం ఒక విశేష మార్పుగా కనిపిస్తోంది. మునుగోడులో అమలవుతున్న ఈ మద్యం నియంత్రణ విధానం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఒక దిక్సూచిలా నిలుస్తోంది.