కోవిడ్ – 19 పై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం
కోవిడ్ -19 తో సహా దేశంలో పెరుగుతున్న సరికొత్త ఇన్ఫ్లుయేంజా కేసుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పెరుగుతున్న కేసులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, డాక్టర్ రాజీవ్ బహాల్ పేరిట రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ విడుదలైంది. దేశంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి క్రమక్రమంగా కోవిడ్ 19 కేసుల సంఖ్యల పెరుగుదల కనిపిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కొన్ని మార్గ దర్శకాలను కేంద్రం విడుదల చేసింది.
పంచ సూత్రాలు..
వెంటిలేషన్ తక్కువగా ఉన్న చోట పెద్ద ఎత్తున గుమిగూడకుండా జాగ్రత్త పడాలి.
దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వారి మరింత అప్రమత్తంగా ఉండాలి.
బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఖర్చీఫ్ వాడాలి.
చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. పబ్లిక్ ప్లేసెస్లో ఉమ్మివేయకూడదు.
టెస్టింగ్ సంఖ్యను పెంచాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. లక్షణాలు కనిపిస్తే ఎవరినీ కలవకుండా జాగ్రత్తపడాలి.
అన్ని రాష్ట్రాలు 5 సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఇటీవలే ఆదేశించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇవే సూత్రాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి మాక్ డ్రిల్ కూడా చేస్తామని కేంద్రం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతుందని తెలిపింది. వీటితోపాటు కొవిడ్, ఇన్ఫ్లుయెంజా మందులు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని ఆదేశించింది కేంద్రం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇవి తప్పకుండా అందుబాటులో ఉండాలని చెప్పింది. ఒకవేళ ఉన్నట్టుండి బాధితుల సంఖ్య పెరిగితే..అందుకు తగ్గట్టుగా పడకలు ఉన్నాయో లేదో ముందే జాగ్రత్త పడాలని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 220 కోట్లకుపైగా వ్యాక్సిన్లు అందించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి హాస్పిటలైజేషన్ పెరుగుతున్నట్టు ఎక్కడా ఆధారాలు లేవని… ఏదేమైనా ప్రికాషనరీ డోస్లు తీసుకోవాలని పేర్కొంది. టెస్టింగ్ల సంఖ్య కూడా పెంచాలంది.

