Home Page SliderNationalNews Alert

డివైడర్‌ను ఢీకొన్న కారు… రిషబ్‌ పంత్‌కి తీవ్ర గాయాలు..

ప్రముఖ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కారు వేగంతో అదుపుతప్పి ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లింది. ఆపై మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయింది. న్యూ ఇయర్‌ సందర్భంగా తల్లిని సర్‌ప్రైజ్‌ చేయాలని పంత్‌ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారు డోర్‌ విండోను బద్దలు కొట్టి రిషబ్‌ బయటపడ్డారు. తలపై గాయాలు, మోకాలి లిగమెంట్‌ తెగిపోవడం, వీపు భాగంలో చర్మం కాలిపోయింది. ఢిల్లీకి వెళుతుండగా, రూర్కీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టోల్‌ గేట్‌ దగ్గర సీసీటీవీ కెమెరా ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. వేగంగా దూసుకొచ్చిన పంత్‌ కారు డివైడర్‌ను ఢీ కొట్టుకుంటూ వెళ్లడం ఈ వీడియో చూడొచ్చు. ఆపై మంటల్లో తగలబడుతున్న కారును అక్కడి వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. గాయపడిన పంత్‌కు స్థానికులు సహాయం చేసిన దృశ్యాలు చూడొచ్చు.

మరోవైపు రిషబ్‌ పంత్‌ ఆరోగ్య స్థితిపై వైద్యులు తొలి బులెటిన్‌ విడుదల చేశారు. డెహ్రాదూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో పంత్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. పరీక్షలన్నీ ముగిసిన తర్వాత పూర్థి స్థాయి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామని డాక్టర్‌ ఆశిష్‌ యాగ్నిక్‌ చెప్పారు.  పంత్‌ త్వరగా కోలుకోవాలని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విట్‌ చేశారు.