రెండేళ్లలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
తెలంగాణలో వచ్చే రెండేళ్లలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడే పాలమూరు ప్రజలకు అసలైన న్యాయం జరుగుతుందని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. పటాన్‌చెరు ఐబీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మరియు అసెంబ్లీలో జరుగుతున్న చర్చలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
శాసనసభలో ప్రజల సమస్యలు, కృష్ణా జలాలపై చర్చలు జరగాల్సింది పోయి, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని రఘునందన్ రావు మండిపడ్డారు. “అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు తప్ప, చిత్తశుద్ధితో చర్చించడం లేదు. ఒకరు పీపీటీ ఇస్తే, మరొకరు దానికి కౌంటర్ ఇవ్వడానికే సమయం వృథా చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. జలాల పంపిణీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని ఆయన విమర్శించారు.
పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు ఏదో చేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని రఘునందన్ రావు అన్నారు. వలసల జిల్లాగా ఉన్న పాలమూరును గత పదేళ్లలో బీఆర్ఎస్, ప్రస్తుత రెండేళ్లలో కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆరోపించారు. “నువ్వు ఎంత తిన్నావు.. నేను ఎంత తినాలి” అనే ధ్యాసలోనే ఈ రెండు పార్టీల నేతలు ఉన్నారని, వారికి ప్రజా శ్రేయస్సు పట్టదని దుయ్యబట్టారు.
ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని కల్పించడమే బీజేపీ లక్ష్యమని, నదుల అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా సాగునీటి సమస్యలను పరిష్కరిస్తున్నామని రఘునందన్ రావు వివరించారు. అసెంబ్లీ చర్చల సందర్భంగా 20 మంది ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం శాసనసభ గౌరవాన్ని తగ్గించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి తదితరులు పాల్గొన్నారు.

