ఆషాఢ బోనాలు అదిరిపోవాలి..మంత్రి పొన్నం..
ఆషాఢ మాసం బోనాలపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఆషాఢ మాస బోనాలు ఈ ఏడాది ఘనంగా అదిరిపోయేలా నిర్వహించాలని అధికారులకు సూచించారు. బోనాలు ఈనెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభం అవుతున్నాయి. మొత్తం నెల రోజుల పాటు ఆషాఢ మాస బోనాలు జరుగనున్నాయి. భక్తులకు అసౌకర్యం లేకుండా ఈ ఉత్సవాలు జరుపుకోవాలి. అమ్మవారికి సేవ చేసుకునే అవకాశం దొరికిందని అధికారులంతా బాధ్యతగా పని చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే బోనాల ఉత్సవాలకు నిధులు కేటాయించారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి.. పాడి పంటలతో, మంచి వ్యాపారాలతో అంతా మంచి జరగాలని భక్తులు అమ్మవారిని వేడుకోవాలి. జీహెచ్ఎంసీ సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలి. తాగునీటి సౌకర్యం లేకుండా చూసుకోవాలి. ఎక్కడా విద్యుత్ అంతరాయాలు కూడా ఉండొద్దు. హెల్త్ క్యాంప్, అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. మహిళలకు ఇబ్బందులు కలుగకుండా షీ టీమ్ అలర్ట్ ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ విభాగం కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాలి. గోల్కొండకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, బస్టాపులు ఏర్పాటు చేస్తాం. మహిళలకు ఉచితంగా బస్సులు ఉన్నాయి కాబట్టి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బోనాల ఉత్సవాలు విజయవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల సహకారం కూడా ఉంటే పండుగ మరింత గ్రాండ్ గా జరుగడం ఖాయం. రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు వేడుకలు ఉండాలని అధికారులకు సూచించారు.