Andhra PradeshHome Page Slider

హజ్ యాత్రికుల ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తి

హజ్ వెళ్లే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ బద్వేలు షేక్ గౌసల్ ఆజమ్ తెలిపారు. యాత్రికుల సౌకర్యార్థం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు విజయవాడలో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే జూన్ 7వ తేదీ నుంచి విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రికులు బయలుదేరబోతున్నారని, అందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఈ సందర్భంగా స్పైస్ జెట్ విమానయాన సంస్థ అధికారులతో విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. ముఖ్యంగా హాజీల భయాందోళనలు వారి లగేజీకి సంబంధించి ఉన్నట్లు గుర్తించామని, అందుకే ఆ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి, అధికారులతో చర్చించామని గౌసల్ ఆజమ్ చెప్పారు. సాధారణంగా ఎయిర్ పోర్టులో లగేజీని ముందుగా తీసుకెళ్తే తనిఖీ చేసి, బరువు ప్రకారం అనుమతి ఇచ్చే విధానం కొనసాగేదని తెలిపారు.

అలాగే యాత్రికులు విడిగా, లగేజీని విడిగా విమానంలోకి పంపే విధానం ఉండేదన్నారు. అయితే ఈ ప్రక్రియ ఆలస్యంతో కూడుకున్నది కావడంతో, జాప్యాన్ని నివారించేందుకు ఆ ప్రక్రియను ముందుగానే పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. యాత్రికులు తమతోపాటు 7 కిలోల లగేజీని తీసుకెళ్లే అనుమతి ఉంటుందని, వ్యక్తిగతంగా 40 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లగలుగుతారని వివరించారు. లగేజీ, ఇమ్మిగ్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియలను విమానాశ్రయానికి వెళ్లడానికి ముందుగానే పూర్తి చేసేలా స్పైస్ జెట్ అధికారులతో చర్చించి, ఆమోదింపజేయడం జరిగిందని ఏపీ హజ్ కమిటీ చైర్మన్ తెలిపారు. హాజీల కోసం ప్రత్యేకంగా విజయవాడ- గుంటూరు జాతీయ రహదారి సమీపంలోని నంబూరు వద్ద ఏర్పాటు చేసిన మదరసాలో వ్యాక్సినేషన్, వెరిఫికేషన్ తదితరాలన్నింటినీ పూర్తి చేసేలా ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. కనుక ఇక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లి ప్రయాణం జరిగేలా ప్రభుత్వం సహకారం అందిస్తోందని, యాత్రికులంతా ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ బద్వేలు షేక్ గౌసల్ ఆజమ్ తో చర్చించిన వారిలో స్పైస్ జెట్ సౌత్-1 రీజినల్ గ్రౌండ్ సర్వీసెస్ సెక్యూరిటీ డెప్యూటీ జనరల్ మేనేజర్ నిఖిల్ సీమ్ వాల్, కర్ణాటక, ఏపీ, తెలంగాణ గ్రౌండ్ సర్వీసెస్ డెప్యూటీ జనరల్ మేనేజర్ గవినో స్టీఫెన్ జెఫ్రీస్, హైదరాబాద్ డెప్యూటీ మేనేజర్ రెహ్మాన్ తదితరులు ఉన్నారు. ముందుగా వీరు నంబూరు మదరసాను సందర్శించి అక్కడ ఏర్పాటు చేస్తున్న లగేజీ చెకింగ్ తదితరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఈవో అబ్దుల్ ఖాదిర్, హజ్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.