స్టేజిపై యానిమల్ నటుడు కంటతడి
యానిమల్ బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ మూవీతో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ వరుస ప్రాజెక్టులు చేస్తున్నాడు. తాజాగా ఆయన తన సోదరుడు సన్నీడియోల్ తో కలిసి ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కెరీర్ విశేషాలు చెబుతూ బాబీ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. “కెరీర్ పరంగా ఒకానొక సమయంలో నేను వరుస ఫెయిల్యూర్ లతో సతమతమయ్యాను. సరైన అవకాశాలు లేక ఎంతో కుంగుబాటుకు గురయ్యా. నన్ను చూసి నా కుటుంబం కూడా తీవ్ర మనోవేదనకు గురైంది. తప్పు లేకుండా వాళ్లు అంతలా బాధపడటం చూసి తట్టుకోలేకపోయా. ఎన్ని సవాళ్లు ఎదురైనా నమ్మకాన్ని వదులుకోలేదు. తిరిగి నిలబడాలనుకున్నా” అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న సన్నీడియోల్ ఆయన్ని ఓదార్చారు. ‘యానిమల్ సినిమాతో తిరిగి కెరీర్ లో పుంజుకున్నానని బాబీ చెప్పారు. వరుస అవకాశాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నానని, అందుకు దర్శక నిర్మాతలతోపాటు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.

