అమెరికా విమానం …206 మంది సురక్షితం
ఒక్క క్షణం తేడా జరిగి ఉంటే పెను ప్రమాదమే జరిగేదేమో! అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి అతి సమీపంగా వెళ్లింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన ఈ ఘటనతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో కలిపి 206 మంది ప్రయాణికులతో బయల్దేరిన యునైటెడ్ విమానం, ఓర్లాండో చేరుకునే వేళ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది. రన్‌వేపై దిగుతున్న క్షణంలో విమానం ముందు ల్యాండింగ్ గేర్‌కు చెందిన టైరు ఒక్కసారిగా ఊడి రన్‌వేపై పడిపోయింది. ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో కేబిన్‌లో కూర్చున్న ప్రయాణికులందరూ ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని బ్రతుకుజీవుడా అంటూ బిగుసుకుపోయారు.
అంతలోనే విమానం మళ్లీ గాల్లోకి లేచింది. ఏమైందో అర్థం కాక ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. కొద్దిసేపటికి పైలట్ ప్రకటన… “విమానం ముందు భాగంలోని టైరు సమస్యకు గురైంది. భయపడాల్సిన అవసరం లేదు” అని తెలియజేశారు. అప్రమత్తతతో వ్యవహరించిన పైలట్ అసాధారణ చాకచక్యంతో విమానాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చి, మరోసారి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
విమానం ఆగిన వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దించారు. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. విమానం రన్‌వేపైనే నిలిచిపోవడంతో తొలగించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ఘటన కారణంగా ఓర్లాండో విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. టైరు ఊడిపడటానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపింది. ప్రమాదం తప్పినప్పటికీ, విమాన భద్రతపై మరోసారి ఈ ఘటన ఆందోళన రేకెత్తించింది.

