Andhra PradeshHome Page Slidermovies

‘నువ్వు కాపాడిన 3772వ ప్రాణం మా ఊర్లోనే’..మహేశ్ బాబు భక్తులు

సూపర్ స్టార్ మహేశ్ బాబు మంచిమనసు అతడిని అభిమానుల మనసులో దేవుడిని చేసింది. ఎంతోమంది పసి పిల్లల గుండె ఆపరేషన్లు చేయించి, కన్నవారి కడుపుకోత కాకుండా కాపాడుతున్న ఆయనను దేవునిగా కొలుస్తున్నారు. తాజాగా మహేష్ బాబు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం కత్తులవారిపేటకు చెందిన మరో చిన్నారిని కాపాడారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారి నాగాబత్తుల రిత్విక అనే రెండేళ్ల చిన్నారికి గుండె శస్త్ర చికిత్స అవసరం కాగా సుమారు రూ.8లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారట.. రెక్కాడితే కాని డొక్కాడని పేదలైన తల్లితండ్రులు మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడిని సంప్రదిస్తే ఆయన ఈ విషయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ కు అందించారు. దీంతో సంప్రదించిన వారం రోజుల వ్యవధిలోనే చిన్నారికి ఆపరేషన్ చేయించింది మహేష్ బాబు ఫౌండేషన్.. ఇప్పుడు చిన్నారి రిత్విక ఆరోగ్యంతో ఉంది.. మహేష్ బాబు చేసిన ఉపకారానికి వారు తమ ప్రాంతంలో నువ్వు దేవుడివి అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకుని తమ కృతజ్ఞతలను తెలిపారు. చిన్నారుల హృద్రోగ సమస్యల నుంచి కాపాడేందుకు నేనున్నానని భరోసా ఇచ్చే సూపర్ స్టార్‌ పట్ల తమ కృతజ్ఞతలను ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఊర్లో అభిమానులు కూడా చాటుకుంటున్నారు.