ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు.. ఇక నుంచి ఆరు పేపర్లే..
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 9, 10 తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ఇక నుంచి 9,10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి సంస్కరణలు అమలు అవుతాయని పేర్కొంది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. సైన్స్ పేపర్‌లో ఫిజిక్స్, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించారు. సైన్స్ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా… మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటల సమయం కేటాయించమని.. టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు.