ఆ భూమి కోతులదే
ఈ రోజుల్లో ఒక 100 గజాల భూమిని సంపాదించడమే సగటు మానవుడికి చాలా కష్టమైన పని. కాస్త భూమిని కొనాలంటే లక్షల కొద్దీ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అలాంటిది కోతులు చాలా సులభంగా 32 ఎకరాల భూమిని సంపాదించేశాయి. ఈ వింత మన పొరుగున ఉన్న మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని ఉప్లా అనే గ్రామంలో వానరాల పేరిట 32 ఎకరాల భూమి ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు కోతులను చాలా ప్రేమగా చూసుకుంటారట. వాటికి ఆహారాన్ని అందించడం, ఎప్పుడు ఇంటికి వచ్చినా వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, వాటికి ఏ హానీ తలపెట్టకపోవడం వంటి చర్యలతో గౌరవిస్తారట. ఈ భూమిని వాటికి ఎవరు రాసిచ్చారో తెలియదు. అయితే గ్రామ పంచాయితీలోని రికార్డుల ప్రకారం 32 ఎకరాల భూమి చాలా స్పష్టంగా వానరాల పేరు మీద ఉందట. పూర్వం గ్రామంలోని అన్ని కార్యక్రమాలలో కోతులు భాగంగా ఉండేవట. ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రస్తుతానికి ఈ 32 ఎకరాల భూమిలో అటవీ శాఖ మొక్కలు నాటిందని, అక్కడ అంతకు ముందు ఒక పాడుబడిన ఇల్లు ఉండేదని, అది కూలిపోయిందని సర్పంచ్ వెల్లడించారు. ఒకప్పుడు గ్రామంలో వివాహాలు జరిగేటప్పుడు తొలుత వానరాలకు బహుమతులు ఇచ్చేవారని, తర్వాతే పెళ్లి పనులు చేసేవారని తెలిపారు. అదే విధంగా ఎవరో ఈ భూమిని కోతులకు బహుమతిగా రాసి ఉండొచ్చని పేర్కొన్నారు.

