థాయ్ నేవీ షిప్ మునక… 31 మంది గల్లంతు
గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ థాయ్ యుద్ధ నౌక ప్రమాదవశాత్తూ ఆదివారం రాత్రి నీట మునిగింది. సముద్రపు నీరు భారీగా నౌకలోకి చేరడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో నౌకలో 106 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 75 మంది నావికులను సహాయక సిబ్బంది కాపాడగా… మరో 31 మంది కోసం నిన్న అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో నావికుల కోసం గాలిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌లో సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో హెచ్‌టీఎంస్ సుఖొథాయ్ ఆదివారం సాయంత్రం గస్తీ విధుల్లో పాల్గొంది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలుల కారణంగా సముద్రపు నీరు యుద్ధనౌకలోని చేరి విద్యుత్తు వ్యవస్థ దెబ్బతింది. ఇంజిన్ వ్యవస్థ పనిచేయకపోవడం, కరెంట్ లేకపోవడంతో మరింత నీరు నౌక లోపలికి వచ్చింది. దీంతో నెమ్మదిగా నౌక ఓ వైపు ఒరుగుతూ నీట మునిగింది.