ఎన్నాళ్లకెన్నాళ్లకు… శాసనమండలిలో థాక్రే, ఫడ్నవీస్ మాటా మంతీ
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాక్రే ఈరోజు మహారాష్ట్ర శాసనమండలిలో ఒకరికి ఒకరు తారసపడ్డారు. ఒకరినొకరు మాట్లాడుకుంటూ, విలేకరులను పలకరించారు. మరాఠీ భాషా విభాగం సమావేశంలో పాల్గొనేందుకు శాసనమండలి సభ్యుడుగా ఉద్ధవ్ థాక్రే సభకు హాజరయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవీ పంచుకోవడంపై శివసేన, బీజేపీ మధ్య విభేదాలతో.. శత్రుత్వం పెరిగింది. సీఎం పీఠం లక్ష్యంగా ఉద్ధవ్ థాక్రే నాడు కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అగాడీ ఏర్పాటు చేసి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శివసేన రెబల్ నాయకుడు ఎక్ నాథ్ షిండే, పార్టీని రెండుగా చీల్చి బీజేపీతో జట్టుకట్టాడు. బీజేపీ మద్దతుతో ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. నాటి నుంచి బీజేపీ, థాక్రే వర్గం మధ్య మాటలు కరువయ్యాయి.


