BusinessHome Page SliderNationalNews

‘భారత్ లో ‘టెస్లా’ రాకపోవచ్చు’..కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు భారత్ లో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్లా కంపెనీకి ఇక్కడ తమ కార్ల విక్రయాల కోసం షోరూమ్స్ తెరవడంపై మాత్రమే ఆసక్తిగా ఉందని, తయారీ ప్లాంట్లపై ఆసక్తి ఉన్నట్లు లేదని విచారం వ్యక్తం చేశారు. భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఇన్వెస్ట్ చేసే సంస్థలకు దిగుమతి సుంకాలపరంగా ప్రోత్సాహకాలిచ్చే స్కీమునకు సంబంధించి పోర్టల్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పడం గమనార్హం. అక్టోబర్ 21 వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుంది. అవసరాన్ని బట్టి 2026 మార్చి 15 వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీ పరిశ్రమల శాఖ అప్లికేషన్ విండోను తిరిగి ప్రారంభించవచ్చు. 4-5 వాహన కంపెనీలు ఈ పథకంపై ప్రాథమికంగా ఆసక్తి కనపర్చాయని, అయితే వాస్తవంగా ఎన్ని దరఖాస్తులు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుందన్నారు. స్కీములో పాలుపంచుకోవాలంటూ జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర అన్ని దేశాల వాహన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని.. అయితే చైనా, పాకిస్తాన్ లాంటి పొరుగు దేశాల సంస్థలకు ఆంక్షలు వర్తిస్తాయన్నారు. కొత్త ఈవీ పథకం ప్రకారం, భారత్ లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వాహన సంస్థలు, 15 శాతం సుంకానికే 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ సుంకాలు 70 – 100 శాతం వరకు ఉంటున్నాయి.