ఉగ్ర దాడి ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న విమాన టికెట్ ఛార్జీలు
పహెల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా నుంచి వచ్చే విమానాలను పాక్ గగనతలంలోకి అనుమతించబోమని ఆ దేశం స్పష్టం చేసింది. దీంతో ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. అలాగే ప్రయాణ సమయం కూడా పెరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి యూరప్, నార్త్ అమెరికా అలాగే మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలు ఇక నుంచి అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. తద్వారా విమాన టికెట్ ధరలు 8 శాతం నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సమయం కూడా 3 గంటలు పెరిగే అవకాశాలున్నాయి.