మహా కుంభమేళాలో ఘోరం..17 మంది మృతి
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాలో నేడు అపశృతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో అమృతస్నానాల కోసం జనాలు పోటెత్తారు. లక్షల సంఖ్యలో భక్తులు సెక్టార్ 2 వద్ద రాత్రి 2 గంటల ప్రాంతంలో రావడం వల్ల తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో భక్తులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. 17 మంది మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం, ప్రకటనలు లేవు. దీనితో అక్కడ అఖాడ పరిషత్ కమిటీ అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ నుండి వెళ్లిపోవాలంటూ ప్రకటనలు చేసింది. అయితే తెల్లవారేసరికి రద్దీ తగ్గడంతో అమృత స్నానాలు కొనసాగిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భక్తులు త్రివేణి సంగమం వద్ద ఉన్న ద్వారం వద్ద ఎగబడకుండా, ఆయా ఘాట్‌ల వద్దే స్నానమాచరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నేడు ఇంత రద్దీని దృష్టిలో పెట్టుకుని, వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు రద్దు చేశారు.

