రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రాజాసింగ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా… కోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాల మేరకు రాజాసింగ్‌ను చంచల్‌గూడ జైలుకు భారీ బందోబస్తుతో పోలీసులు తరలించారు. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌తో నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, ఎంఐఎం కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుపార్టీల కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కోర్టు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల పోటా పోటీ నినాదాలు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. రెండు వర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఒకవైపు నాంపల్లి కోర్టు లోపల వాదనలు కొనసాగుతుంటే.. ఇంకోవైపు బయట ఆందోళనలు జరిగాయి.

