Andhra PradeshNews

అమరావతి పాదయాత్రలో ఉద్రిక్తత

వైసీపీ కార్యకర్తలు  నిడదవోలు బ్రిడ్జి వద్ద ఈ పాదయాత్రకు నిరసనగా నల్ల బెలూన్లు, ప్లకార్డులతో పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు, అమరావతి రైతులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. ప్రస్తుతం నిడదవోలు బ్రిడ్జ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. 3 రాజధానులకు మద్దతుగా ఓవైపు, అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని ప్రతిపాదించారు నాటి సీఎం చంద్రబాబు. రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సేకరించి… రాజధానిని అభివృద్ధి చేసేందుకు సంకల్పించారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎం జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అప్పటి వరకు ఏపీ రాజధానిగా కొనసాగుతున్న అమరావతితోపాటు, మరో రెండు రాజధానులను ప్రతిపాదించారు సీఎం జగన్. దీంతో ఏపీలోని రాజధాని అమరావతి రైతులు, విపక్షాలు ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాటి నుంచి అమరావతి రైతులు వెయ్యి రోజులకు పైగా దీక్షలు కొనసాగించారు. తాజాగా అమరావతి మాత్రమే ఏపీకి రాజాధాని ఉండాలంటూ అరసవిల్లి వరకు మహాపాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ఇప్పటి వరకు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకున్నా… హైకోర్టును ఆశ్రయించి రైతులు యాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. అమరావతి స్వప్నం సాకారం కోసం పాదయాత్రను విజయవంతం కొనసాగిస్తూ వస్తున్నారు.