Andhra PradeshHome Page Slider

ఫైబర్ నెట్‌ కేసులో చంద్రబాబుకు టెంపరరీ రిలీఫ్‌

ఫైబర్‌నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి నవంబర్ 9 వరకు ఉపశమనం దొరికింది. అప్పటివరకు ఆయన్ను పిటీ వారంట్ మీద ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచడం కానీ, అరెస్టు చేయడం కానీ వద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు.

ఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నవంబర్ 9 వరకు ఉపశమనం దొరికింది. అప్పటివరకు ఆయన్ను పీటీ వారంట్ మీద ఏసీబీ కోర్టు ముందు హాజరు పరచవద్దని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ.. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్‌పీపై శుక్రవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసు ఈ నెల 13న తొలిసారి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అక్టోబర్ 16న చంద్రబాబును తమ ముందు ప్రత్యక్షంగా హాజరుపరచాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన సమయంలో  అరెస్టు చేయకుండా బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు అడ్వొకేట్ సిద్ధార్థ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ పైనా ధర్మాసనం అదేరోజు విచారణ జరిగింది. 17-ఎ సెక్షన్ అన్నది ఫైబర్‌నెట్ కేసుకూ వర్తిస్తుందన్న విషయాన్ని పరగణనలోకి తీసుకున్న ధర్మాసనం తొలుత స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విచారించిన తర్వాతే ఈ కేసుపై వింటామని.. అంతవరకూ చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఏపీ ప్రభుత్వాన్ని మౌఖికంగా ఆదేశిస్తూ విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు సమయాభావం వల్ల కేసు విచారణ సాధ్యం కాకపోవడంతో 20వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం మరోమారు విచారణకు రాగా 17-ఎ సెక్షన్‌పై తీర్పు వెలువడిన తర్వాత ఈ కేసును విచారిస్తామంటూ ధర్మాసనం నవంబర్ 9కి వాయిదా వేసింది.    విచారణ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, అందులో 17ఎ కేసులో తీర్పు రిజర్వ్ అయిందని ధర్మాసనానికి తెలిపారు. మరో కేసును హైకోర్టు వాయిదా వేసిందని చెప్పారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకుంటూ 17ఎ కేసులో తీర్పు వెలువరించే వరకూ వేచి చూద్దాం.. అందుకు సిద్ధార్థ లూథ్రా అంగీకరిస్తూ ఆ విషయాన్ని మీకే వదిలిపెడుతున్నామని ధర్మాసనానికి చెప్పారు. అయితే ఇదివరకు కోర్టు ముందు హాజరుపరచవద్దని, అరెస్టు కూడా చేయొద్దని మౌఖికంగా మాత్రమే ఆదేశించారని, దాన్ని కొనసాగించకపోతే తమ పిటిషన్ నిరర్ధకమవుతుందని తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ అభిప్రాయం కోరారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం అన్నది నిరంతరం జరగదు, ఆ విషయాన్ని సుప్రీంకోర్టు నాలుగు తీర్పుల్లో చెప్పింది అని ఆయన బదులిచ్చారు. ఇది వేరే కేసు అయినప్పుడు అరెస్టుకు అవకాశం ఉంటుందని జస్టిస్ త్రివేది వాదన. రంజిత్ కుమార్ స్పందిస్తూ ఆ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగించాలని తాము కోరామన్నారు. ప్రస్తుతం పిటిషనర్ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు కాబట్టి ఆయన్ను మీరు విచారించొచ్చా అని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. కోర్టు అనుమతి లేకుండా విచారించడం సాధ్యం కాదని రంజిత్ కుమార్ పేర్కొన్నారు. విచారించాలంటే ఈ కేసులో ప్రత్యేకంగా, లాంఛనంగా అరెస్టు చేయాలా అని న్యాయమూర్తి ప్రశ్నించగా అవునని బదులిచ్చారు. మేం సీఆర్‌పీసీ సెక్షన్ 267 కింద వారెంట్ కోసం దరఖాస్తు చేశాం. ఆయన మా కస్టడీలో ఉన్నట్లు చూపించకపోతే, పోలీసు కస్టడీ కోసం దరఖాస్తు చేయలేమని రంజిత్ వ్యాఖ్య.