Andhra PradeshNews

రైతుల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్‌

యాత్రకు అడుగడుగునా పోలీసుల ఆటంకం

యాత్రను నాలుగు రోజులు నిలిపివేసిన రైతులు

పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం

అమరావతి రైతులు మహా పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. పోలీసుల నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నామని.. పోలీసుల తీరును కోర్టులోనే తేల్చుకుంటామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. కోర్టుకు నాలుగు రోజులు సెలవులు ఉన్నందున ఆ తర్వాత కోర్టు ఇచ్చే డైరెక్షన్‌తో పాదయాత్రను కొనసాగిస్తామని పేర్కొన్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచీ రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇటీవల యాత్రపై పోలీసులు లాఠీచార్జి చేసి పలువురు రైతులను గాయపరిచారు.

రైతులపై అడుగడుగునా నిర్బంధం

అమరావతి రైతుల పాదయాత్ర శనివారం 41వ రోజుకు చేరుకుంది. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బైపాస్‌ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. రైతులు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ వద్దకు వారిని కలిసి మద్దతు తెలిపేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ కట్టారు. కానీ.. ఫంక్షన్‌ హాల్‌ను చుట్టుముట్టిన పోలీసులు బయటి వారిని లోనికి అనుమతించలేదు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పాదయాత్రలో 600 మందికి మించకూడదని, వాళ్లంతా గుర్తింపు కార్డులు చూపించాలని.. అనుమతి లేని వాహనాలను ముందుకు కదలనీయబోమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

బంద్‌కు వైసీపీ పిలుపు..

మరోవైపు పాదయాత్రకు పోటీగా.. మూడురాజధానులకు మద్దతుగా నినాదాలు, నల్ల బెలూన్లతో నిరసనలు వ్యక్తమయ్యాయి. పాదయాత్ర ఏ ప్రాంతంలోకి వస్తే.. ఆ ప్రాంతంలో బంద్‌ పాటించాలని వైసీపీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం 40వ రోజు పాదయాత్రపై పోలీసులు జులం ప్రదర్శించారు. రైతులు ముందుకు కదలకుండా తాళ్లు అడ్డం పెట్టారు. వెనక్కి నెట్టేసి బరబరా ఈడ్చేశారు. పాదయాత్రలో పాల్గొంటున్న వాహనాలను దారి మళ్లించారు. గుర్తింపు కార్డులు చూపించలేదన్న సాకుతో మద్దతుదారులనూ వెనక్కి పంపించారు. అధికార పార్టీ అండతో మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా పోలీసులు బల ప్రదర్శన చేయడంతో పాదయాత్ర రక్తసిక్తమైంది.

గుర్తింపు కార్డులుంటేనే పాదయాత్రకు అనుమతి..

శనివారం నాటి పాదయాత్రను పూర్తిగా పోలీసుల నిఘాలోనే కొనసాగించాలని షరతు విధించారు. 600 మంది రైతులు తమ గుర్తింపు కార్డులను చూపిస్తేనే పాదయాత్రకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. సంఘీభావం తెలిపే వారికి యాత్రలో పాల్గొనే అనుమతి లేదన్నారు. అదే సందర్భంలో మంత్రి వేణుగోపాలకృష్ణ తన అనుచరులతో కలిసి అమరావతికి నిరసనగా నల్లబెలూన్లతో చేపట్టిన నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రైతులు పాదయాత్ర చేస్తున్న మార్గంలో నిరసన తెలపొద్దని హైకోర్టు చెప్పినా అధికారులు మంత్రి నిరసనకు అనుమతి ఇవ్వడం, పోలీసులు భద్రత కల్పించడంపై విమర్శలొచ్చాయి.