దేవాలయంలో దారుణం..ఆరుగురు మృతి
ఉత్తర గోవాలోని బిచ్లిమ్ జిల్లా శిర్గావ్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఇక్కడ ప్రతీఏటా మే 2న శ్రీ లైరాయ్(పార్వతి) అమ్మవారి జాతరకు భారీగా జనాలు తరలివస్తారు. శుక్రవారం జరిగిన ఈ జాతరలో భారీగా తొక్కిసలాట చోటు చేసుకోవడం వల్ల ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ జాతరకు సుమారు 70 వేల మంది హాజరయ్యారని, సరిగ్గా జాతర జరిగే సమయంలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊపిరాడక ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బాధితుల్ని పరామర్శించారు.

