తలకు మించిన అప్పుల భారంలో తెలుగు రాష్ట్రాలు విలవిల
తెలుగు రాష్ట్రాలు ఒకదాన్ని మించి ఒకటి అప్పుల భారాన్ని తలకెత్తుకుంటున్నాయి. రకరకాల పథకాల పేరుతో ఓటర్లను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న స్కీముల వల్ల పెరిగిపోతున్న రుణభారం వివరాలను కేంద్రం వెల్లడించింది. భారత రాష్ట్రసమితి ఎంపీలు అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో కేంద్రం సమాధానమిచ్చింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను వెల్లడి చేసింది.

ఏపీలో 2018 బడ్జెట్ లెక్కల ప్రకారం అప్పు దాదాపు 2. 30 లక్షల కోట్ల రూపాయలు కాగా.. అది పెరిగి ప్రస్తుతం 4 లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక శాఖ వెల్లడి చేసింది. గత మూడేళ్లుగా ఏపీ జీడీపీలో అప్పుల శాతం విపరీతంగా పెరిగి పోయింది. 2015 లో రాష్ట్ర జీడీపీలో 23 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు అది 37 శాతానికి పెరిగింది.

ఏపీ మాత్రమేనా? నేనేం తక్కువ కాదంటూ తెలంగాణా కూడా పోటీగా అప్పుల భారాన్ని పెంచుకుంటూ పోతోంది. 2018 లో 1.60 లక్షల రూపాయలు ఉండే అప్పులు 2022 నాటికి 3.12 లక్షల రూపాయలకు చేరుకున్నాయి. 2022 నాటికి తెలంగాణా రాష్ట్ర అప్పులు జీడీపీలో 27.5 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.