తెలుగు వారు ప్రాభవం కోల్పోతున్నారు
దేశంలో తెలుగు వారు ప్రాభవం కోల్పోయే దుస్థితిలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.ఆదివారం హైద్రాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు సమాఖ్య (WTF) 12 వ ద్వైవార్షిక సమావేశాల్లో రేవంత్ ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించడంలో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషను, ఉనికిని, మనుగడను, సంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రచురించిన “తెలుగుదనం – తెలుగుధనం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సదస్సులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి , సమాఖ్య అధ్యక్షురాలు వీఎల్ ఇందిరా దత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


 
							