ఆసియా కప్‌లో దుర్గయ్య సేవలు
అందరి దృష్టి ఆసియా కప్ మీదే. తొలి మ్యాచ్ నుంచి కిక్కెస్తున్న ఆసియా కప్ లో ఓ తెలుగు వాడి సేవలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు. అతను క్రికెటర్ కాదు. అంపైర్ అంతకన్నా కాదు. కానీ క్రికెట్ తో అవినాభావ సంబంధం అయితే ఉంది. ఇంతకీ అతనెవరు..? ఆసియా కప్ తో అతనికున్న సంబంధం ఏంటి..? అక్కడ చేసే పనేంటో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఓకే.

అతని పేరు దుర్గయ్య. ఊరు మంచిర్యాల జిల్లా చెన్నూర్. ఒకప్పుడు ఆ ఊరి వారికే సరిగ్గా తెలియని చెన్నయ్య ఇప్పుడు దేశం మొత్తానికి పరిచయమయ్యాడు. కారణం ఆసియా కప్ లో ఓ అరుదైన అవకాశం దక్కడమే. ఆ టోర్నమెంట్ లో పాల్గొనే జట్లకు వైద్య సేవలు అందించే అవకాశం కలగడమే. దుర్గయ్య 15 సంవత్సరాల పాటు 108 వాహనంలో ఈఎంటీగా పనిచేశాడు. తర్వాత పై చదువుల కోసం ఉద్యోగం వదిలేశాడు. ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో మెడికల్ ఎమర్జెన్సీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా అతను పనిచేసే కంపెనీ ఆసియా కప్‌లో పాల్గొనే క్రికెట్ జట్లకు వైద్య సేవలు అందించే కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకోగా , అందులో భాగంగా దుర్గయ్యకు ఈ అరుదైన అవకాశం వచ్చింది.