Andhra PradeshNews AlertTelangana

“దేశభాషలందు తెలుగు లెస్స” నేడు తెలుగుభాషా దినోత్సవం

ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి తన భావాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలాగే బుద్దిజీవి ఐన మానవుడు తన భావవ్యక్తీకరణకు సైగలు చేసుకొనే ఆదిమానవయుగం నుండీ వివిధ భాషలను మాట్లాడగలిగే స్థితికి వేల సంవత్సరాల క్రితమే చేరుకున్నాడు. ఆయా ప్రాంతాలను, సంస్కృతిని బట్టి వారివారి భాషలు ఏర్పడ్డాయి. ఏ భాష వారికైనా వారి భాష యందు ప్రేమ, మక్కువ ఉంటాయి. కానీ మన తెలుగువారి ప్రారబ్ధం ఏమిటో ఉపాధికోసం నేర్చుకున్న ఆంగ్లం అంతర్జాతీయ భాషగా మారి, తెలుగుభాషకు ముప్పుగా తయారయ్యింది. చివరకు మాతృభాషనే మింగేసే అనకొండలా తయారయ్యింది.

గిడుగు రామమూర్తి జయంతి

ఈ కమ్మనైన అమ్మభాషను పరిరక్షించడానికి నడుం కట్టిన వ్యక్తి గిడుగు రామమూర్తి జయంతి రోజునే మనం తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆయన 1963 ఆగస్టు 29న జన్మించారు. ఆయన తెలుగుభాషాభివృద్ధికి సమరశంఖం పూరించి, సరళమైన తెలుగుభాషను సామాన్యుల చెంతకు తీసుకువెళ్లారు. అపరభాషా భగీరథునిగా పేరుపొందారు. అప్పటి వరకూ పండితులకు మాత్రమే పరిమితమైన తెలుగుభాష తియ్యదనం పామరులకు కూడా రుచించింది. ఆధునిక సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన పుట్టినరోజును తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకోవడం మన తెలుగుప్రజలందరికీ గర్వకారణం. తెలుగు సమాజంలో మార్పు తేవడానికి కందుకూరి వీరేశలింగం ఎంత కృషి చేసారో, గురజాడ అప్పారావుగారు తెలుగుసాహిత్యానికి ఎంత సేవ చేసారో.. తెలుగు భాషను ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులుగారు అంతే కృషి చేసారు.

తెలుగుభాష గొప్పతనం మనం చెప్పుకోవడం మాత్రమే కాదు. విజయనగర సామ్రాజ్యాధీసుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏనాడో తెలుగుభాష సౌందర్యాన్ని తెలుసుకుని తెలుగులో “ఆముక్తమాల్యద” అను కావ్యకన్యకను రచించారు. “దేశభాషలందు తెలుగులెస్స”అని కొనియాడారు. ఇంగ్లాండ్ నుండి వచ్చి.. ఉద్యోగశిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, ఈ భాషపై మమకారం పెంచుకుని తెలుగునిఘంటువునే రచించారు బ్రౌన్ దొర. ఒక విదేశీయుడే తెలుగుభాష కోసం అంత చేయగలిగినప్పుడు, స్వతంత్ర దేశంలో ఉంటూ, ప్రజాస్వామ్యం ద్వారా మనమెన్నుకున్న ప్రభుత్వాలు ఎంతచేయాలో ఆలోచించండి.

తెలుగు మహా కవులు

ఈ సందర్భంగా తెలుగుభాషకు కృషి చేసిన గొప్ప కవులు, వాగ్గేయకారులను ఒకసారి స్మరించుకుందాం. భక్తిమార్గంలో త్యాగయ్య, అన్నమయ్య,  పోతన, వెంగమాంబ, క్షేత్రయ్య, రామదాసు, మొదలైన మహా భక్తులు ఉంటే,   నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, విశ్వనాథ, శ్రీశ్రీ, సినారె, కాళోజీ, సురవరం వంటి కవి పుంగవులు తెలుగు  సాహిత్యాన్ని మరో మెట్టు పైకి తీసుకువెళ్లారు. ఈనాడు హిందీ తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. కానీ ఆధునిక పోకడల కారణంగా విపరీతంగా నిరాదరణకు గురవుతున్న తీరు చాలా బాధాకరం.

వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన భాష ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు కూడా కనుమరుగవుతాయని గుర్తించాలి. వేరుకు తెగులు పడితే మహా వృక్షమైనా సరే నేలకూలకు తప్పదు. ఇలాంటి పరిస్థితి మన తెలుగుభాషకు రాకముందే మేలుకోవడం చాలా మంచిది.

ఈ రోజు తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పుడు తెలుగును కాపాడుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాలన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియం మాయమవుతుందని, వింటుంటే బాధగా ఉందన్నారు. ఒక రాష్ట్రం నుంచి ఇలా పూర్తిగా మాతృభాష బోధనా భాషగా మాయం కావడమనేది దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. దేశంలో భాషా ప్రాతిపదికగా ఏర్పడిన తొలి రాష్ట్రంలో ఇలా జరగడం ఇంకా దురదృష్టకరమన్నారు. మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులు వారి భాషకు ఎంత ప్రాముఖ్యతనిస్తాయో మనకు తెలుసు.

ఇకనైనా మన పాలకులు భాషాభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితిలో మార్పులు తేవడం సులభమే.