సమరానికి సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ
వరుస షెడ్యూళ్లతో చంద్రబాబు బిజీ బిజీ
పొత్తులపై చర్చలకు ప్రణాళికలు
ముందస్తు ఎన్నికల ప్రచారంపై అప్రమత్తం
అభ్యర్థుల ఎంపికలపై తుది కసరత్తులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. వరుస షెడ్యూల్ తో ఆయన బిజీ అయ్యారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు సంకేతాలిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. రానున్న డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అందుకు తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే పార్టీ శ్రేణులకు ముందస్తు ఎన్నికల ఖాయమని చెబుతూ వస్తున్న చంద్రబాబు అనేక కార్యక్రమాల అమలకు శ్రీకారం చుట్టారు.

గడిచిన ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యటిస్తూ పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. డిసెంబర్లోనే ఎన్నికలు జరిగేందుకు అవకాశాలు ఉండటం ఇప్పటికే కేంద్రం ముందస్తు ఎన్నికల నిర్వహణపై అవసరమైన చర్యలు చేపట్టడంతో చంద్రబాబు దానికి తగినట్టుగా కార్యాచరణను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక వడపోతపై సీరియస్ గా దృష్టి పెట్టినా ఆయన ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కనీసం రోజుకి 20 కుటుంబాలు ఇళ్లను సందర్శించాలని ఆ పార్టీ నేతలకు ఆయన సూచిస్తున్నారు. పార్టీ మ్యానిఫెస్టో తో పాటు ప్రజల సమస్యలను తెలుసుకోవాలని హితబోధ చేస్తున్నారు.

ఇదే సమయంలో చంద్రబాబు కూడా ఇక ఏమాత్రం విరామం లేకుండా జిల్లాలలో పర్యటించాలని యోచిస్తున్నారు. గడచిన ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు రెండుసార్లు పర్యటించిన చంద్రబాబు ఇప్పుడు అదే స్పీడును కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. ఎన్నికల ముందుగా వచ్చినప్పటికీ ఇబ్బంది లేకుండా ప్రజాక్షేత్రంలో నేతలు ప్రచారభేరిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న కార్యక్రమాలుకు అదనంగా మరింత భారీగా ప్రచారం నిర్వహించాలని కూడా ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ వెనుక బడిన నియోజకవర్గాల్లో అధికంగా కార్యక్రమాలు నిర్వహించి పట్టు సాధించే దిశగా వ్యూహాలను చంద్రబాబు రచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈనెల 5,6,7 తేదీల్లో అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాలలో చర్చా కార్యక్రమాలు సమావేశాలు రోడ్డు షోలు సభల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు పొత్తుల అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన, భారతీయ జనతా పార్టీలతో కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన చంద్రబాబు తాజా సమీకరణాల నేపథ్యంలో మరోసారి సమావేశానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తుల అంశానికి త్వరలోనే క్లారిటీ తీసుకువచ్చి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవైపు జిల్లాల పర్యటనలు చేస్తూనే మరోవైపు పొత్తుల అంశంపై చంద్రబాబు సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.

