నేటి నుంచి తెలుగుదేశం పార్టీ బస్సు యాత్రలు
మహానాడు వేదికగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర షెడ్యూలును ప్రకటించింది. పార్టీ నేతలు అంతా ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ఈ బస్సు యాత్రలను సోమవారం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో యాత్ర బస్సులను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఉద్దేశాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా బస్సు యాత్రను తెలుగుదేశం పార్టీ నిర్వహించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 125 నియోజకవర్గాలను ఎంపిక చేశారు. మొత్తం ఐదు బస్సుల ద్వారా మినీ మేనిఫెస్టోపై ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరికి ఈ పథకాలు తెలిసేలా తీసుకెళ్లడంమే లక్ష్యంగా యాత్ర కొనసాగించనున్నారు. భవిష్యత్తుకు గారెంటీ పేరుతో సాగే ఈ యాత్ర ద్వారా మహానాడులో పూరించిన ఎన్నికల శంఖారావం కొనసాగింపుగా యాత్ర కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ అమలు చేయబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం బస్సు ప్రచారం ప్రారంభిస్తున్నట్లు పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు.