వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసి పోటీ: సీపీఐ నారాయణ
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, సీపిఐ కలిసి పోటీ చేస్తాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ బరిలోకి దిగుతోందని పొత్తు కుదిరితే ఓట్లు ఇవ్వటమే కాదు సీట్లు కూడా ఇవ్వాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రెండో రోజు రిలే దీక్షలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైన నారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రం మేలుకోరి ఏవైనా సలహాలు ఇస్తే తీసుకునే తత్వం జగన్ కు లేదని అన్నారు. పోలవరం పై పోరాడటానికి రాష్ట్ర ప్రభుత్వానికి భయంగా ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. పోలవరంపై వైయస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న పోరాట తత్వం జగన్ లో కనిపించడం లేదని తెలిపారు. చూస్తూ ఉంటే తండ్రి సిద్ధాంతాలకు కూడా జగన్ పంగనామాలు పెట్టే లాగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఉద్యమాల ద్వారా పోలవరాన్ని రాజకీయ అంశంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. పోలవరాన్ని ఎవరు నిర్లక్ష్యం చేసిన కనుమరుగైపోతారని హెచ్చరించారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయకపోతే ఆ ముంపు లోనే జనం జగన్ ని ముంచేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కను సన్నల్లోనే సీఎం జగన్ పని చేస్తున్నారని ఆరోపించారు. విభజన హామీలు తాము సాధించుకోవస్తామని దీమా వ్యక్తం చేశారు.