‘తెలంగాణ మహిళా వర్సిటీకి ఈ వీరవనిత పేరు పెడతాం’..రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో త్యాగశీలురు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ సరైన గౌరవం కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆనాడు దొరల అరాచకాలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలబడిన వీరవనిత చాకలి ఐలమ్మ పేరును తెలంగాణ మహిళా వర్సిటీకి పెడుతున్నామన్నారు. ఆమె మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నామని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 39వ వర్థంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన నృత్యరూపకాన్ని వీక్షించారు మంత్రివర్గం. ఈ సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే నాటి ప్రధానులు ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావులు పేదలకు భూమి పట్టాల పంపిణీ, భూ సంస్కరణలు వంటి చర్యలు చేపట్టారన్నారు. ఆమె పేరు తెలంగాణలో అందరికీ గుర్తుండేలా కోఠిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నామని ప్రకటించారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన పోరాటయోధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందన్నారు. అందుకే ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రజాభవన్‌కు జ్యోతిరావు పూలే పేర్లు పెట్టామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ కాలంలో ధరణి పేరుతో గుంజుకున్న పేదల భూములను తిరిగి తీసుకుని వారికి ఇప్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

