Home Page SliderTelangana

కేసీఆర్ బెదిరింపులకు తెలంగాణ లొంగదు-ఈటల రాజేందర్

తెలంగాణా త్యాగవీరుల త్యాగాలకు గౌరవం దక్కాలంటే భారతీయ జనతా పార్టీ రావాలన్నారు బీజేపీ తెలంగాణ ఎన్నికల కమిటీ కన్వీనర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ప్రభుత్వ పథకాలన్నీ బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లకే వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు ఇవ్వమని బెదిరిస్తున్నారని.. తెలంగాణ మీ అబ్బజాగీరుకాదన్నారు ఈటల. బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లొస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణాను అప్పుల కుప్పగా మార్చింది కేసీఆరేనని అన్నారు. తెలంగాణలో ప్రతీ వ్యక్తి మీద లక్షా ముప్పై వేల అప్పు ఉందన్నారు. కళ్యాణలక్ష్మి, పెన్షన్లలో కోత పెట్టారని… అవన్నీ సరైనా సమయంలో రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.

తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకునే సుష్మాస్వరాజ్ ఆనాడు తెలంగాణా కోసం ప్రాణత్యాగాలు చెయ్యొద్దని, తెలంగాణ ఏర్పాడుతుందని మాటిచ్చారని.. రాజ్‌నాథ్ సింగ్ మద్దతు ఇస్తున్నామని తెలిపిన తరువాతే తెలంగాణ ప్రక్రియ వేగవంతం అయ్యిందని ఈటల అన్నారు. అసలు బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్న ఈటల… వచ్చే ఎన్నికలలో బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గొప్ప తెలంగాణాను బీజేపీ మాత్రమే నిర్మించగలదన్న ఈటల.. దేశంలోనే ఎన్నికలలో అత్యధిక డబ్బు ఖర్చుపెట్టే నీచమైన సంస్కృతి బీఆర్‌ఎస్ పార్టీదన్నారు.

ఇతర పార్టీల నాయకులకు వెలకట్టే కల్చర్ కేసీఆర్‌దన్న ఈటల, తెలంగాణ వచ్చాక గొప్పగా దేశానికే ఆదర్శంగా ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి… ఇప్పుడు మద్యం, ఎన్నికల ఖర్చులో మాత్రం తెలంగాణాను మొదటి వరుసలో నిలిపాడన్నారు. ప్రజలకు మంచి చేయాలని నిజంగా కలలు కనే నాయకులకు అవకాశం లేకుండా డబ్బుతో గెలుస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పదవిని కేసీఆర్ అంగట్లో సరుకుగా చేసారన్న ఈటల… ఎన్నికల కోడ్ వచ్చిందని, కొత్త పథకాలు ఇవ్వడానికి వీలు లేదని.. ఐనప్పటికీ బీఆర్ఎస్ నాయకులు మభ్యపెడుతున్నారన్నారు. తీసుకున్న అప్లికేషన్లు అన్నీ బుట్టదాఖలు తప్ప చేస్తారు తప్ప, ఇచ్చే అవకాశం లేదన్నారు. కేసీఆర్ చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ ప్రజలకు ఈటల పిలుపునిచ్చారు.