సోలార్ వీధిదీపాల దిశగా తెలంగాణ
రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. పెద్ద కంపెనీల నుండి టెండర్లు పిలవడంతో పాటు వీధిదీపాలకు సోలార్ పవర్ వినియోగం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇవాళ ఐసీసీసీలో మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ప్రతి విద్యుత్ పోల్ సర్వే చేయాలని, బంటీ వంటి సంస్థల ద్వారా థర్డ్ పార్టీ ఆడిట్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని వీధిదీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసి, ఎప్పటికప్పుడు వాటి పనితీరును విశ్లేషించాలని సూచించారు. గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణ బాధ్యతను గ్రామపంచాయతీలకే అప్పగించి, ఏర్పాటు మరియు నిర్వహణలో సర్పంచులకు అధికారం ఇవ్వాలని, ఎంపీడీఓ స్థాయిలో పర్యవేక్షణ జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేంకట నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, కోర్ జర్మన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్జన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.