అపర చాణక్యుడి రాకతో పులకించిన తెలంగాణ
దళిత కార్యకర్త ఇంట్లో చాయ్.. అన్నదాతల గోడు ఆలకించడం.. మునుగోడు వేదికపై నుంచి తెలంగాణ ప్రజలకు అభయహస్తం.. మీడియా మొఘల్‌తో మంతనాలు.. టాలీవుడ్ బాద్ షాతో భేటీ.. అపర చాణక్యుడు, అభినవ సర్ధార్ ఆదివారం నాటి ఒక రోజు పర్యటనతో తెలంగాణ రాష్ట్రం పులకించింది. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ గడ్డపై దిగినప్పటి నుంచి బిజీ షెడ్యూల్‌తో రాత్రి తిరుగు ప్రయాణమయ్యే దాకా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఆద్యంతం అబ్బురపరిచింది. మునుగోడులో సమర భేరీ
తో తెలంగాణాలో టీఆర్‌ఎస్ సర్కారుపై బీజేపీ భేరీ
మోగించింది.

సామాన్యుడి వద్దకు బీజేపీ..
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగ్యనగరం గడ్డపై అడుగు పెట్టగానే ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా తెలంగాణ బీజేపీకి అమ్మవారి ఆశీస్సులు అందించారు. తర్వాత దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంట్లో తేనేటి విందుకు హాజరై సామాన్యుడి మనస్సులో చెరగని ముద్ర వేశారు. కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి తన ఇంట్లో చాయ్ తాగడం ద్వారా సామాన్యులంటే బీజేపీకి ఎంతటి గౌరవమో చాటి చెప్పారని సత్యనారాయణ పులకించారు. తర్వాత దేశానికి వెన్నెముక అయిన అన్నదాత ఆవేదనను తెలుసుకోవడం బీజేపీ అగ్రనేత దూరదృష్టికి నిదర్శనంగా నిలిచింది. సేంద్రియ వ్యవసాయం వల్ల ప్రయోజనాలు, ఆర్థికంగా కలిగే లాభాల గురించి రైతులకు విడమరిచి చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అబద్ధపు ప్రచారాలు, రైతులను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకునే కుట్రను ఈ ఒక్క భేటీతో పటాపంచలు చేశారు.

తెలంగాణ రైతుల కష్టాలు తీర్చేందుకు కంకణం..
అంతేకాదు.. మునుగోడులో జరిగిన సమర భేరీలో రైతన్నకు అండగా ఉంటాను
అని అభయమిచ్చి తెలంగాణ రైతుల కష్టాలు తీర్చేందుకు కంకణం కట్టుకున్నారు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారన్న సీఎం కేసీఆర్ ఆరోపణల్లో పసలేదని అదే మునుగోడు సాక్షిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు నాయకులు కుండబద్దలు కొట్టారు. ఇక నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను తాను పరిష్కరించానన్న కేసీఆర్ మాటలు పచ్చి అబద్ధాలని చెప్పిన కిషన్‌రెడ్డి.. కేంద్రం అందించిన సాయం గురించి గణాంకాలతో సహా వివరించారు. అంతేకాదు.. అవినీతి కేసీఆర్‌కు ఈడీ, సీబీఐ భయం పట్టుకుందని, అందుకే కలలో కూడా బీజేపీనే కలవరిస్తున్నారని పలువురు పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడక తప్పదన్న చైతన్యాన్ని ప్రజల్లో కల్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రైతు రాజులా బతుకుతాడని.. దానికి తానూ పూచీకత్తునని మునుగోడు గడ్డపై నుంచి అభయ హస్తం ఇచ్చారు.

టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో గందరగోళం..
దేశ రాజకీయాలను ఒంటి చేత్తో మలుపు తిప్పుతున్న అమిత్ షా పర్యటనతో కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని, తెలంగాణ గడ్డపై త్వరలో బీజేపీ ముఖ్యమంత్రి ఖాయమన్న ఆ పార్టీ అగ్రనేత అభయంతో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మునుగోడు ప్రజలు కమలంపై ఓటేసి తెలంగాణాలో కుటుంబ పాలనకు చరమగీతం పాడతారన్న ధీమా ఆదివారం నాటి మునుగోడు సభ ద్వారా వ్యక్తమైంది. ప్రజారంజక కాషాయ దళం పాలన కోసం తెలంగాణ ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్న విషయం ఈ సభకు హాజరైన జనవాహినిని చూస్తే తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక్కడ విజయం సాధించే పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె నెక్కుతుందని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే.. మునుగోడు విజయం మూడు పార్టీలకూ కీలకమైంది.

ఏకాంత భేటీలో ఎన్నో అర్ధాలు..
సభ ముగిసిన తర్వాత కూడా అమిత్ షా బిజీబిజీగానే గడిపారు. మునుగోడు నుంచి తిరుగు ప్రయాణంలో మీడియా మొఘల్ రామోజీరావుతోనూ, టాలీవుడ్ బాద్ షా జూనియర్ ఎన్టీయార్‌తోనూ ఏకాంతంగా భేటీ అవడం కూడా తెలంగాణాలో చర్చనీయాంశమైంది. ఈ భేటీలు మర్యాద కోసమే అని చెబుతున్నప్పటికీ అమిత్ షా ఏ పని చేసినా దాని వెనుక పెద్ద వ్యూహం దాగి ఉంటుందనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది తెలంగాణాలో కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు తన పర్యటన ఆరంభం మాత్రమేనని, పార్టీని రాష్ట్రంలో విస్తరించేందుకు మున్ముందు మరిన్ని పర్యటనలు ఉంటాయని అపర చాణిక్యుడు బీజేపీ నేతలకు అభయమిచ్చారు. మొత్తానికి.. అమిత్ షా పర్యటనతో తెలంగాణ బీజేపీ నేతల్లో సమరోత్సాహం పొంగి పొర్లుతోందనడంలో సందేహం లేదు.