ఇరాన్ లో తెలంగాణ విద్యార్థుల బందీలు !
ఇరాన్‌లో నెలకొన్న తీవ్ర అంతర్గత అశాంతి, ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వందలాది మంది విద్యార్థులు బందీలుగా మారిన దుస్ధితి నెలకొంది. యూనివర్సిటీ యాజమాన్యాలు పాస్‌పోర్టులు ఇవ్వకపోవడం, యుద్ధ వాతావరణం కారణంగా విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడం, ఇంటర్నెట్ ఆంక్షలు విద్యార్థులను నిస్సహాయ స్థితిలోకి నెట్టేశాయి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని షహీద్ బెహెష్తీ యూనివర్సిటీలోనే 70 నుంచి 80 మంది వరకు హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య వందల్లో ఉందని తెలుస్తోంది. పలు యూనివర్సిటీలు విద్యార్థుల వీసాలు, పాస్ పోర్టులను తమ వద్దే అట్టిపెట్టుకోవడంతో వారు దేశం విడిచి రావాలన్నా సాధ్యపడటం లేదు. పాస్‌పోర్టులు లేకపోవడంతో విమాన టికెట్లు బుక్ చేసుకోలేక అవస్ధలు పడుతున్నారు.
మరోవైపు, సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వెళ్లిన ఈ విద్యార్థులకు ప్రస్తుతం విమాన టికెట్ల ధరలు కూడా అందని ద్రాక్షగా మారాయి. అశాంతి నేపథ్యంలో టికెట్ల రేట్లు భారీగా పెరగడంతో వారు ఆర్థికంగా కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇరాన్‌లో ఇంటర్నెట్‌పై కఠిన ఆంక్షలు ఉండటంతో కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా లేకపోవడం ఆందోళనను కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మరోవైపు, హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. “విదేశాంగ మంత్రి మాట్లాడటం సరిపోదు. ఇది చర్యలు తీసుకోవాల్సిన సమయం. విద్యార్థుల పాస్‌పోర్టులు ఇప్పించి, అవసరమైతే ఎయిర్‌లిఫ్ట్ చేసి భారత్‌కు తీసుకురావాలి” అని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రాణ భద్రతతో పాటు వారి భవిష్యత్తుపై కూడా సందేహాలు నెలకొన్నాయి. భారీ ఫీజులు చెల్లించి మెడికల్, టెక్నికల్ కోర్సుల్లో చేరిన వారు మధ్యలోనే భారత్‌కు వస్తే డిగ్రీల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, విద్యార్థుల తరలింపును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

