ఎలక్ట్రిక్ వాహనదారులకు తెలంగాణ సర్కార్ బంపరాఫర్
ఎలక్ట్రిక్ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్ ను మినహాయిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కీలకమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఈ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గతంలో ఉన్న పరిమితులను రద్దు చేసి మరో రెండేళ్ల వరకు ట్యాక్స్లను రద్దు చేస్తూ జీవోను కూడా జారీ చేసింది. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు, కార్లు, ట్యాక్సీలు, క్యాబ్లు, ఆటోరిక్షాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సుల కొనుగోలు చేసినవారికి భారీ ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.