తెలంగాణాలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్-2 పరీక్షల తెదీలను ఖరారు చేసింది. ఈ మేరకు ఆగస్టు 29,30వ తేదిలలో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-3, సబ్ రిజిస్టార్ గ్రేడ్-2, అసిస్టెంట్ రిజిస్టార్ (కోఆపరేటివ్ సోసైటీ),ఏసీటీఓ, డిప్యూటీ తహసీల్దార్,సహయ లేబర్ అధికారి,ఎంపిడీఓ, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మొదలైన పోస్టుల్లో మొత్తం 783 ఖాళీల భర్తీకి గత డిసెంబరులో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి ఈ ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారింకంగా వెల్లడించింది.

కాగా ఈ పరీక్షను నాలుగు పేపర్లలో మొత్తం 600 మార్కులకు నిర్వహిస్తున్నారు. పేపర్-1(జనరల్ స్టడీస్),పేపర్-2(చరిత్ర,రాజకీయం,సమాజం),పేపర్-3(ఆర్ధిక వ్యవస్థ,అభివృద్ది),పేపర్-4(తెలంగాణ ఉద్యమం,రాష్ట్ర ఆవిర్భావం).ఒక్కో పేపర్లో 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉండవు.అలానే ఈసారి ఇంటర్య్వూ తొలగించారు. ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఒక్కో రోజు రెండు పేపర్ల చొప్పున రెండు రోజుల్లో నాలుగు పేపర్లకు అభ్యర్ధులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతుంది.