Home Page SliderTelangana

తెలంగాణ పోలింగ్ డిసెంబర్ 7న, లెక్కింపు 11న?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినట్టుగానే, ఈసారి కూడా ఎన్నికలు అదే విధంగా నిర్వహించే అవకాశం కన్పిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 12 నోటిఫికేషన్ ప్రకటించడంతోపాటుగా, 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణ ప్రక్రియ తర్వాత నవంబర్ 22న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఎన్నికలు డిసెంబర్ 7 నిర్వహించి డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది తాత్కాలిక షెడ్యూల్ అయినప్పటికీ… రియల్ షెడ్యూల్ సైతం కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది.

2018 ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే రకంగా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం ఎన్నికల సైతం నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ తొలి వారంలో విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగా… కేంద్ర ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో టీమ్ తెలంగాణలో పర్యటించనుంది. తెలంగాణలో తాజాగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేసిన ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి త్వరలో ఒక నిర్ణయానికి రానుంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5 వరకు తెలంగాణలో పర్యటిస్తుంది. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలంగాణ ఎన్నికల అధికారులకు సీఈసీ ఆదేశించారు.