తరతరాలకు స్ఫూర్తినిచ్చే ‘తెలంగాణా అమరవీరుల జ్యోతి స్మారకచిహ్నం’
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అసువులు బాసిన అమర వీరుల స్మారక చిహ్నంగా రూపొందుతున్న 150 అడుగుల ఎత్తైన జ్యోతి రూపం ప్రారంభానికి సిద్ధమయ్యింది. గురువారం జూన్ 22న తెలంగాణా సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభించబోతున్నారు. 2017 జూన్‌లో శంకుస్థాపన చేసిన దీనిని పూర్తి చేయడానికి ఆరేళ్ల కాలం పట్టినా ఇది చరిత్రలో నిలిచిపోయేలా రూపొందించాలనుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణా ప్రముఖ కళాకారుడు రమణారెడ్డి రూపకల్పన చేసిన ప్రజ్వలించే దీపం ఆకారంలో మెరిసే అద్దం (మిర్రర్ ఇమేజ్)గా దీనిని రూపొందించారు. అద్దంగా దీనిని మార్చడానికి పూర్తి స్టెయిన్‌లెస్ స్టీల్‌ను వినియోగించారు. దుబయ్‌లోని మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్‌ను నిర్మించిన సంస్థ సలహాలతో ఈ నిర్మాణాన్ని 178 కోట్లతో తయారుచేశారు.

దీనిలో తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారు, తెలంగాణా ఉద్యమం మొదటి నుండీ ఉన్న ప్రముఖులు, రాజకీయ కోణాలు, రాష్ట్రసాధన అనంతరం సాధించిన ప్రగతి కలిపి 20 నిముషాల చిత్రప్రదర్శన కూడా ఉంటుంది. ఇది ఆరు అంతస్తులతో ఉంటుంది. దీనిలో దీపం ఎత్తు 26 మీటర్లు. దీని మొత్తం విస్తీర్ణం 3.29 ఎకరాలు. 15 వందల టన్నుల స్టీలును ఈ నిర్మాణానికి వినియోగించారు. బేస్మెంట్‌లో పార్కింగ్ కూడా ఉంటుంది. మొదటి అంతస్తులో ఫొటో గ్యాలరీ, 70 మందికి సీటింగ్ సౌకర్యంతో థియేటర్ ఉంది.

రెండు వంటశాలలు, రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. వీటి సహాయంతో వెయ్యి మందికి ఒకేసారి భోజనం సిద్ధం చేయవచ్చు. తెలంగాణా అమర వీరులు నిత్యసజీవులుగా ఉండాలనే సంకల్పంతో నిర్మించిన ఈ కట్టడం ఎదురుగానే తెలంగాణా సచివాలయం ఉంది. అనుక్షణం ఈ వీరుల త్యాగాలను మరిచిపోకుండా ప్రజాప్రతినిధులు పనిచేసేలా ఉత్తేజం కలిగిస్తుంది ఈ అమర జ్యోతి. విద్యుద్దీప కాంతులతో, లేజర్ కిరణాలతో ‘జోహార్ తెలంగాణా అమరవీరులకు’ అనే నినాదంతో రేపు దీనిని ఆవిష్కరించబోతున్నారు.