ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆయన గత ఎన్నికలలో తప్పుడు అఫిడవిట్ సమర్పించాడంతూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు వేసిన కేసే దీనికి కారణం. 2018లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారు. తనకు, తన భార్యకు సంబంధించిన పూర్తి ఆస్తుల వివరాలు ఫారం 26 ప్రకారం ఎన్నికల సంఘానికి సమర్పించలేదని ప్రత్యర్థిగా పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు కేసు నమోదు చేశారు. అప్పుడు కాంగ్రెస్ నుండి గెలిచిన వనమా వెంకటేశ్వర రావు అనంతరం టీఅర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కాగా ఇప్పుడు ఈ తీర్పు వెలువడింది. జస్టిస్ రాధా రాణి ఈ తీర్పును ప్రకటించారు. అంతేకాక వెంకటేశ్వరరావుకు 5 లక్షల జరిమానా కూడా హైకోర్టు విధించింది. 2019లో ఈ కేసును ఫైల్ చేశారు జలగం వెంకట్రావు. ఇప్పుడు ఈ ఎన్నిక చెల్లకపోవడం వల్ల జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించారు.