తెలంగాణాను కేసీఆర్ సొంత జాగీర్‌గా మార్చుకున్నారు-ప్రియాంక ధ్వజం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలకు నెలకు 25 వేల పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామంది. ప్రతి నిరుద్యోగికి నెలకు 4 వేల భృతి ఇస్తామంది. విద్యార్థునులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీ కానుకగా ఇస్తామని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన యువ సంఘర్షణ సభలో ప్రియాంకా గాంధీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. 2024లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడుతోందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏ ఉద్దేశాల కోసమైతే ఏర్పడిందో వాటన్నింటినీ, కాంగ్రెస్ పార్టీ ఆచరణలో చూపిస్తోందన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించే ప్రత్యేక రాష్ట్రానికి సోనియా గాంధీ జైకొట్టారన్నారు ప్రియాంకా గాంధీ. జై బోలో తెలంగాణా అంటూ స్పీచ్ ప్రారంభించిన ప్రియాంక, అమరుల త్యాగం వల్ల తెలంగాణ సిద్ధించిందన్నారు. తెలంగాణ కోసం ఎన్నో బలిదానాలు జరిగాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. ఎవరో ఒకరి వల్లే తెలంగాణ రాలేదన్నారు. త్యాగమంటో ఏంటో గాంధీ కుటుంబానికే తెలుసునన్నారు. తెలంగాణ ఏర్పాటై 9 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకున్నా, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనుకున్నామన్నామని, కానీ అవి జరగలేదన్నారు. కేసీఆర్ సర్కారు తెలంగాణాను తమ జాగీరుగా భావిస్తోందని ధ్వజమెత్తారు. సోనియా కుమార్తెగా హామీ ఇస్తున్నాన్న ప్రియాంక, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యూత్ డిక్లరేషన్ అమలు చేసి తీరతామన్నారు.