మరో కొత్త పథకం ప్రారంభించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ అనే పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్‌రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కిట్ల పథకాన్ని ప్రారంభించారు. బలవర్ధకమైన, పోషకాహారంతో కూడిన ఈ కిట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు వెచ్చించింది. ఒక్కొక్కరికి రెండు సార్లు ఈ కిట్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1962 రూపాయలు విలువ చేసే ఈ కిట్‌ను గర్భిణులకు పంపిణీ చేశారు.
ఈ కిట్‌లో న్యూట్రి మిక్స్ పౌడర్, ఐరన్ సిరప్, ఖర్జూరం, నెయ్యి, ఆల్బెండజోల్ మాత్ర, కప్పు ఉంటాయి. మొదటి కిట్‌ను గర్భిణులకు 13-27 వారాల మధ్య, రెండో కిట్‌ను 28-34 వారాల మధ్య ఇవ్వనున్నారు. దాదాపు 1.25 లక్షల మంది గర్భిణులకు పథకం ఉపయోగపడుతుంది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందుగా ఎక్కువ రక్తహీనత ఉన్న 9 జిల్లల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ సర్కార్.