ఐపీఎల్ వేలంలో మెరిసిన తెలంగాణ కుర్రాడు
తెలంగాణ కుర్రాడు అవనీశ్ రావు (18) ఐపీఎల్ వేలంలో ఛాన్స్ కొట్టేశాడు. ఈ అండర్- 19 యువకిశోరం హేమాహేమీలు పోటీపడే ఐపీఎల్ వేలంలో మెరవడం చాలా పెద్ద విశేషమనే చెప్పాలి. సిరిసిల్ల జిల్లాకు చెందిన అరవెల్లి అవనీశ్ రావును ఐపీఎల్ వేలంలో రూ.20 లక్షలతో చెన్నై సూపర్ సింగ్స్ చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లలో రాణిస్తే సీఎస్‌కే చివరి జట్టులో ఆడే అవకాశాన్ని పొందే అవకాశం తద్వారా టీమిండియాలో చోటు దక్కించుకునే అధ్బుత అవకాశం లభించవచ్చు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి హైదరాబాద్ జట్టు తరపున అండర్ 14లో లీగ్ మ్యాచ్‌లతో మొదలు పెట్టి తన కెరీర్‌ను పరుగులు పెట్టించాడు అవనీశ్.

చెన్నై, కేరళ, గోవా, పాండిచ్చేరి వంటి జట్లను మట్టి కరిపించి, దక్షిణాది టాపర్‌గా నిలిచాడు. అంతేకాదు, విజయ్ మర్చంట్ ట్రోఫీలో అండర్ 16లో హైదరాబాద్ జట్టులో ఆడి, చెన్నై జట్టుపై 183 పరుగులు చేసి, హైదరాబాద్‌ను సెమీస్‌కు చేర్చాడు. ప్రస్తుతం అండర్ 19లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిచ్చరపిడుగు దేశంలోని బ్యాట్స్‌మెన్‌లలో 13 వర్యాంకులో ఉన్నాడు. ఇండియా ఫీల్డ్ కోచ్ ఆర్. శ్రీధర్ ఇతనికి ప్రస్తుత కోచ్‌గా ఉన్నారు. ప్రస్తుత ఇండియా టాప్ క్రికెటర్లు కోహ్లి, రోహిత్, శుభమన్‌లు కూడా ఇలా అండర్ 19 నుండి వచ్చిన వారే. ఇప్పుడు సీఎస్‌కేలో స్థానం సాధించిన అవనీశ్, కెప్టెన్ కూల్ ధోనీ దృష్టిలో పడితే టీమిండియాలో స్థానం సంపాదించడం కష్టమేం కాదు.

