“ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు 12 నెలల జీతాలు ఇప్పించాలి”..ఈటల
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం TPTF ఆధ్వర్యంలో, తెలంగాణ విద్యాభివృద్ధి- ప్రైవేట్ ఉపాధ్యాయుల పాత్ర పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు 12 నెలల జీతాలు ఇప్పించు. కనీసం అడ్డ మీద కూలికి పోతున్న లేబర్ కన్నా మెరుగైన జీతభత్యాలు వచ్చేలా చూడండి. వారికి కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రైవేట్ టీచర్ల పైన చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాటికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

ముఖ్యమంత్రి వ్యవహార శైలి, మాట తీరు, చలోక్తులు కొంతమందిని గాయపరుస్తున్నాయన్న సోయి ఆయన మర్చిపోతున్నారు. ఒకనాడు స్కూల్లు లేవు, ఆశ్రమ పాఠశాలలు ఉండేవి.. వాటికి స్ఫూర్తిగానే ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు వచ్చాయన్న సోయి పాలకులకు లేదు. ఇవాళ విద్య ప్రభుత్వ పరంగా పుట్టలేదు. విద్య.. ఆశ్రమాలు, ఆశ్రమ పాఠశాలల ద్వారా పుట్టింది. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఒకటే చెప్పాను.. విద్య మీద పెట్టే ప్రతి పైసా అది ఎక్స్పెండిచర్ లిస్ట్ లో ఉండొద్దు, అది ఇన్వెస్ట్మెంట్ లాగా భావించాలి అని చెప్పాను. తల్లిదండ్రులు కూడా ఆస్తులు వారసత్వంగా ఇస్తే ఉండదు, జ్ఞానాన్ని వారసత్వంగా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈరోజు ఈ టీచర్ల ప్రతిపాదనకు నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను”. అని వ్యాఖ్యానించారు.

