పెళ్లిపేరుతో టీచరమ్మకు రూ.2.5 కోట్లకు కుచ్చుటోపీ
బెంగళూరులో ఒక టీచరమ్మ పెళ్లి పేరుతో నిండా మునిగింది. ఈ స్కాంలో రూ.2.5 కోట్లకు ఆమె భారీగా నష్టపోయింది. నగరంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయురాలికి ఓ పెళ్లి సంబంధాల వేదికపై పరిచయమైన నిందితుడు మాయమాటలతో రూ.2.5 కోట్ల తన ఖాతాలోకి మళ్లించుకుని మోసగించాడు. దీనితో బాధితురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మొత్తాన్ని నాలుగేళ్లుగా తన ఖాతా నుండి సొమ్మును అతని ఖాతాలోకి మళ్లించుకున్నాడని పేర్కొంది. దీనిపై నగర సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు నమోదైంది. భర్త మరణించాక ఆమె ఒంటరి జీవితం ప్రారంభించినా.. కొన్నాళ్లకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనితో 2019లో అంతర్జాల వేదికపై పెళ్లి ప్రకటన ఇవ్వగా… అక్కడే ఆకాశ్ కుమార్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. ‘నేనూ భారతీయుడినే. అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నా. ఓ ఇజ్రాయిల్ కంపెనీలో ఇంజినీరుగా పని చేస్తున్నా’ అంటూ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవడానికి పరస్పరం అంగీకరించారు. ఆ మరుసటి సంవత్సరం.. 2020లో వేతనం రాలేదంటూ కొంత సొమ్ము కావాలని ఆకాశ్ విన్నవించడంతో ఆమె జాలి పడి కొంత నగదు జమా చేశారు. ఇలా నాలుగేళ్లుగా వివిధ కారణాలతో నమ్మించి రూ.2.5 కోట్లు తీసుకున్నట్లు ఆమె వివరించింది. 2024 నవంబరు నుంచి డబ్బు ఇవ్వడం ఆపేయడంతో.. అతడు ఫోన్ చేయడం మానేశాడని ఆమె ఫిర్యాదులో వివరించింది.