దేశానికే గర్వకారణమైన గురువు మన సర్వేపల్లి
మనదేశంలో పురాణకాలం నుండీ గురువులకు ఇచ్చే గౌరవం, మర్యాద చాలా ఎక్కువ. ఆచార్య దేవోభవ అంటూ గురువును దేవునితో సమానంగా గౌరవించేవారు. రాముడు, కృష్ణుడు వంటి అవతారపురుషులే గురువును దైవంగా భావించి వారి ఆజ్ఞలు పాటించేవారు. ఈనాడు సెప్టెంబరు 5 వతేదీన దేశవ్యాప్తంగా TEACHER’S DAY జరుపుకుంటున్నాము. దీనికి కారణం ఒక మహనీయుడి చరిత్ర. గురు స్థానానికే భాష్యం చెప్పిన ఒక తత్వవేత్త ఆదర్శజీవితం. ఆయనే డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.
భారత మొదటి రాష్ట్రపతిగా, రెండవ ఉపరాష్ట్రపతిగా పనిచేసి, ఆ పదవులకే గౌరవం తెచ్చిన ఆయన జీవిత ప్రస్థానాన్ని ఈ టీచర్స్ డే సందర్భంగా గుర్తుచేసుకుందాం.
రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5 వతేదీన తిరుపతి సమీపంలోని తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వీరాస్వామి, తల్లి సీతమ్మ. ఆయన ప్రాధమిక విద్యాభ్యాసం తిరుత్తణిలోని కెవి హైస్కూల్‌లో జరిగింది. తర్వాత తిరుపతిలోని హెర్మన్స్బర్ ఎవాంజిలికల్ లూథరన్ మిషన్ స్కూల్‌లోనూ, వాలాజీపేటలోని ప్రభుత్వ హైయ్యర్ సెకండరీ స్కూల్‌లోనూ చదివారు. ఆయన ప్రతిభ ఎటువంటిదంటే చదువు అంతా స్కాలర్ షిప్‌లోతోనే జరిగింది. వారి తండ్రిగారు వీరాస్వామిగారు, రాధాకృష్ణన్‌ను ఏదైనా ఆలయంలో పూజారిగా స్థిరపడాలని కోరుకొనేవారట. అయితే కుమారుడి అద్భుత పరిజ్ఞానం చూసి చదివించాలని నిర్ణయించుకున్నారట.

ఆయనకు 16 ఏళ్ల వయస్సులోనే వివాహం జరిగింది. 6 గురు సంతానం కలిగారు. ఆయన కేవలం 17 రూపాయల జీతంతో తమ కుటుంబాన్ని అతి కష్టంగా పోషించుకొనేవారు. ఆయన ఎంత పేదరికాన్ని అనుభవించేవారంటే అరిటాకులు కూడా కొనలేక ఒక్కోసారు నేలను శుభ్రం చేసుకొని భోజనం చేసే దుర్భర పరిస్థితులు కూడా అనుభవించారు. చివరికి ఆర్థిక కష్టాలు తట్టుకోలేక తనకు వచ్చిన పతకాలను కూడా అమ్ముకొనేవారు.
రాధాకృష్ణన్ విద్యార్థులను వారి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించేవారు. వారి ఉన్నతి కోసం ఎంతో ఆలోచించేవారు. వారి వాగ్దాటి, ఉపన్యాసాల ద్వారా విద్యార్థులను ఎంతగానే ఆకట్టుకొనేవారు. వారు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి, అనంతరం రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలోనూ, మైసూరులోనూ, కలకత్తా విశ్వవిద్యాలయాల్లోనూ తత్వ శాఖలో అధ్యక్షునిగా పనిచేశారు. 1929లో మాంచెస్టర్‌లోని కాలేజీలో కూడా ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అనంతరం భారత్‌కు తిరిగివచ్చి 1931 నుండి 1936 వరకూ ఆంధ్రయూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆ కాలంలోనే ఆయన లిటరేచర్‌లో నోబుల్ బహుమతికి కూడా నామినేట్ అయ్యారు. తర్వాత కాలంలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో 1948 జనవరి వరకూ వైస్ ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. ఆయన విద్యార్థులకు సహాయ పడడానికి ఎప్పుడూ ముందుండేవారు. ఆయనకు వచ్చిన బహుమతులు, ప్రైజ్‌మనీల డబ్బు అంతా పేదవిద్యార్థులకోసమే ఖర్చుపెట్టేవారు. తనకు వచ్చిన టెంపుల్టన్ ప్రైజ్ బహుమతి మొత్తాన్ని, వచ్చిన వెంటనే విద్యాసేవల కోసం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి ఇచ్చేశారు. వీరి ఉన్నత లక్ష్యాలను, ప్రతిభను గుర్తించిన ఆక్స్‌ఫర్డ్ విద్యాలయం రాధాకృష్ణన్ పేరిట విద్యార్థులకు ఉపకారవేతనాన్ని కూడా అందజేస్తోంది.

విద్యావేత్తగా అత్యున్నత స్థితికి చేరిన ఆయన రాజకీయ జీవితం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఆయన 1931లో లీగ్ ఆఫ్ నేషన్స్ కమిటీ ఫర్ ఇంటలెక్చువల్ కో- ఆపరేషన్‌కు నామినేట్ అయ్యారు. 1947 లో స్వాతంత్ర్యానంతరం యూనెస్కోలో ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం సోవియట్ యూనియన్‌కు భారత రాయబారిగా 1949 నుండి 1952 వరకూ పనిచేశారు. 1952లో భారత తొలి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయనకు ఏ రాజకీయ నేపథ్యమూ లేదు. ఏ పదవిలో ఉన్నా భారతీయ ఆధ్యాత్మిక విలువలను, హిందూ ధర్మ విశిష్టతను పెంపొందించడమే ఆయన లక్ష్యంగా ఉండేది.
విద్యార్థులపై ఇంత ప్రేమ చూపించే గురువంటే ఏ విద్యార్థికి ఇష్టం ఉండదు. ఆయనను విద్యార్థులు తమ తల్లిదండ్రులతో సమానంగా గౌరవించేవారు. బెనారస్ యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ చేస్తున్నప్పుడు ఆయనను ఇంటినుండి పల్లకీలో మోస్తూ విద్యార్థులంతా ఒక ఊరేగింపుగా విద్యాలయానికి తీసుకువచ్చారు. ఇంతటి గౌరవం ఇప్పటి వరకూ ఏ ఉపాధ్యాయునికీ దక్కలేదు.

ఆయన భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 1962లో ఆయనకు పుట్టినరోజును విద్యార్థులు వేడుకగా జరపాలని కోరుకుంటే తన పుట్టినరోజు బదులు ఉపాధ్యాయ దినోత్సవం జరపాలని కోరుకున్నారట. అప్పటి నుండీ ప్రతిఏటా రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబరు 5 ను ఉపాధ్యాయదినోత్సవంగా దేశంలో జరుపుకోవడం పరిపాటయ్యింది. ఆయన రాష్ట్రపతి పదవిలో 1962 నుండి 1967 వరకూ పనిచేశారు. తర్వాత కూడా ఆయనను రాష్ట్రపతి గా ఉండమని కోరితే కూడా కాదన్న గొప్ప త్యాగశీలి ఆయన. పదవీవిరమణ అనంతరం మద్రాసులోని తన నివాసంలో గడిపి, 1975 ఏప్రిల్ 17 న 86 ఏళ్ల ప్రాయంలో కన్నుమూసారు. ఆయన వంటి అసాధారణ ప్రజ్ఞాశాలి, రాజనీతి కోవిదుడు, తత్వవేత్త, విద్యావేత్త పుట్టినరోజును టీచర్స్ డే గా జరుపుకోవడం భారతజాతికి ఎంతో సంతోషకరమైన విషయం కదూ.

