Andhra PradeshHome Page Slider

16 పార్టీల వ్యతిరేకత… రిమోట్ ఓటింగ్ విధానానికి టీడీపీ సై

◆ పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం చర్యలు
◆ గతంలో బ్యాలెట్ ఓటింగ్ కు పట్టు పట్టిన టీడీపీ
◆ తాజాగా మారిన చంద్రబాబు నిర్ణయం

ఎన్నికల సంస్కరణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త విధానాలను అవలంబించబోతుంది. అయితే గతంలో ఓటింగ్ విధానాలను వ్యతిరేకించిన ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తాజాగా రిమోట్ ఓటింగ్ విధానానికి మద్దతు ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోతున్న నిర్ణయం చాలా బాగుందంటూ ప్రశంసించడాన్ని బట్టి చూస్తుంటే టీడీపీ ఎన్నికల విధానంలో యూటర్న్ తీసుకుందా అన్న సందేహం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతుంది. ఢిల్లీలో జరిగిన రాజకీయ పార్టీలతో ఈసీ బేటిలో ఈసీ నిర్ణయానికి అనుకూలంగా టీడీపీ మద్దతును ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం గతంలో తాము తీసుకున్న ఓ విధానపరమైన నిర్ణయానికి పూర్తి భిన్నంగా ఉండటంతో ఆ పార్టీ యూటర్న్ పై రాష్ట్రవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో టీడీపీ తరఫున ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, వేమూరి రవికుమార్ హాజరయ్యారు. సమావేశానికి హాజరైన 16 పార్టీలు మాత్రం ఈ విధానాన్ని ఆమోదించేది లేదని తేల్చి చెప్పాయి.

ఢిల్లీలో ఎన్నికల సంఘం రిమోట్ ఓటింగ్ యంత్రం పై ఓటు హక్కు వినియోగం పై నిర్వహించిన ఈ సమావేశంలో 16 రాజకీయ పార్టీలు పాల్గొనగా టీడీపీ తరఫున ఇద్దరు నేతలు హాజరయ్యారు. రిమోట్ ఓటింగ్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించే విధంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పై రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించింది. రిమోట్ ఓటింగ్ ద్వారా ఓటింగ్ శాతం మెరుగుపడే అవకాశాలు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం పేర్కొంటూ ఉండగా దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. అయితే వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి టీడీపీ పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయానికి టీడీపీ జై కొట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ ల విధానం ఉండేది అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈవీఎంల విధానాన్ని తీసుకొచ్చింది.

2014 ఎన్నికల్లో మిత్రపక్షంగా కలిసి పోటీ చేసిన టీడీపీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఈవీఎంలకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని అప్పట్లో డిమాండ్ చేసింది. అయితే 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ గడిచిన మూడున్నర సంవత్సర కాలంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బట్టి వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో తన మిత్రపక్షమైన బీజేపీ జనసేన తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. ఈ క్రమంలోనే ఈసీ తాజా నిర్ణయాన్ని టీడీపీ సమర్థించడం చర్చినియాంశంగా మారింది. గతంలో ఈవీఎంల విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్యాలెట్ విధానానికి డిమాండ్ చేసిన టీడీపీ వ్యూహాత్మకంగా రిమోట్ విధానానికి జై కొట్టింది. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత పావులు కదుపుతూ ఆ మేరకు సరికొత్త వ్యూహానికి సిద్ధమవుతున్నారన్న వాదన రాజకీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.